యూఎస్‌లో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు తాజా ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చదువుతో పాటు ఖర్చులు భరించేందుకు కొందరు విద్యార్థులు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే వీసా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని తాజా సంఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
మిన్నెసోటా రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పార్క్ ప్రాంతంలో ఒక ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్కడ అనధికారికంగా పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను అధికారులు గుర్తించారు. వారు F1 Visa (విద్యార్థి వీసా) నిబంధనలను ఉల్లంఘించి రెస్టారెంట్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నట్టు తేలడంతో అరెస్టు చేశారు.
ఈ తనిఖీలను ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) అధికారులు నిర్వహించారు. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రశ్నించిన అనంతరం, విద్యార్థి వీసాపై ఉండి బయటి ఉద్యోగాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా పని చేయడం వీసా ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనల అమలులో కఠినత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విదేశీ విద్యార్థుల విషయంలో చిన్న తప్పు జరిగినా కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చదువు పూర్తయ్యే ముందు అనధికారికంగా పనిచేయడం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీసా రద్దు, డిపోర్టేషన్ వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి ఏదైనా ఉద్యోగం చేయాలని భావించే విద్యార్థులు తప్పనిసరిగా తమ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అడ్వైజర్‌ను సంప్రదించి, చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాతే పని చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.