క్రికెట్‌తో ఒక్కటైన యూకే తెలుగు సమాజం..
టీపీఎల్ 2026తో తెలుగు యువతలో క్రీడా ఉత్సాహం..
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తెలుగు సమాజాన్ని క్రీడా స్ఫూర్తితో ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌గా నిలిచిన TAL ప్రీమియర్ లీగ్ (TPL) 2026 ఘనంగా ప్రారంభమైంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ 17వ ఎడిషన్ మే 16న లండన్‌లోని గ్రీన్‌ఫోర్డ్ ప్రాంతంలో ఉన్న ఈలింగ్ హాన్‌వెలియన్స్ క్రికెట్ మైదానంలో ప్రారంభమైంది.
2009లో చిన్న స్థాయిలో మొదలైన ఈ క్రికెట్ పోటీలు, ఇప్పుడు యూకేలోని తెలుగు ప్రజలను క్రీడలు, స్నేహబంధాలు, సామాజిక స్పూర్తితో కలిపే అతిపెద్ద వేదికగా ఎదిగాయి. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా భారీ ఉత్సాహంతో ఆటగాళ్లు, కుటుంబాలు, ప్రేక్షకులు పాల్గొన్నారు.
ఈ ఏడాది టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. రాబోయే 15 వారాల పాటు లీగ్ మ్యాచ్‌లు, నాకౌట్ దశలు, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ జరుగనున్నాయి. చివరగా ఆగస్టు 16న స్లౌ క్రికెట్ క్లబ్‌లో గ్రాండ్ ఫైనల్ నిర్వహించనున్నారు.
ప్రారంభ కార్యక్రమంలో TAL ఛైర్మన్ రవి సబ్బా మాట్లాడుతూ.. క్రీడలు తెలుగు ప్రజలను మరింత దగ్గర చేసే శక్తివంతమైన వేదిక అని అన్నారు. సమాజంలో ఐక్యతను పెంచడంలో TAL ఎప్పుడూ ముందుంటుందని, టోర్నమెంట్‌లో పాల్గొంటున్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ట్రస్టీ సత్య పెద్ది రెడ్డి, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ సింధూర చెరుకు, వాలంటీర్ల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ట్రస్టీ బోర్డు సభ్యులు అశోక్ మధిశెట్టి, వెంకట్ నీలా, రవి మొచెర్ల, అనిల్ అనంతుల, కిరణ్ కప్పేట తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్‌తో పాటు సమాజ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టిన TAL, “100 రోజులలో 1 మిలియన్ అడుగులు” అనే ప్రత్యేక ఫండ్‌రైజింగ్ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ, సమాజ సేవ కోసం నిధులు సేకరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. వెంకట్ తోటకూర, శ్రీహరి అరిగే, సునీత అరిగే, సింధూర చెరుకు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు.
క్రీడలు, ఆరోగ్యం, సామాజిక సేవలను కలిపి యూకేలోని తెలుగు కుటుంబాల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేయడానికి TAL నిరంతరం కృషి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.