వైసీపీ పాలనలో ప్రజలపై భారం మోపారని సోమిరెడ్డి విమర్శలు..
జగన్ హయాంలోనే ఏపీలో అత్యధిక ఇంధన ధరలు: సోమిరెడ్డి..
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ నాయకులు నిర్వహిస్తున్న ధర్నాలు ప్రజలను మోసం చేసే రాజకీయ డ్రామాలేనని ఆయన అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉండేవని సోమిరెడ్డి ఆరోపించారు. రోడ్ సెస్, వ్యాట్ పేర్లతో ప్రజలపై భారీ భారం మోపారని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై కొంత మేర ధరలు పెంచిన విషయాన్ని పట్టుకుని వైసీపీ నేతలు రోడ్లపైకి రావడం విడ్డూరంగా ఉందన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111 నుంచి రూ.112 వరకు ఉండేదని, అదే సమయంలో తెలంగాణలో రూ.109, కర్ణాటకలో రూ.101 మాత్రమే ఉండేదని గుర్తుచేశారు. కర్ణాటకతో పోలిస్తే ఏపీలో లీటర్కు సుమారు రూ.11 ఎక్కువ వసూలు చేశారని చెప్పారు. తాను బెంగళూరు వెళ్లినప్పుడు చిత్తూరు సరిహద్దు దాటే ముందు కర్ణాటకలోనే కారుకు ఫుల్ ట్యాంక్ చేయించుకునేవాడినని, అలా చేస్తే వందల రూపాయలు ఆదా అయ్యేవని తెలిపారు.
డీజిల్ ధరల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందన్నారు. ఏపీలో డీజిల్ ధర రూ.99.50 ఉండగా, కర్ణాటకలో రూ.87.89, తెలంగాణలో రూ.97.82 మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండు సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదని స్పష్టం చేశారు.
మద్యం ధరలపై కూడా సోమిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘జగనన్న టాక్స్’ పేరుతో విస్కీ, బ్రాందీ, బీర్ల ధరలను విపరీతంగా పెంచారని ఆరోపించారు. ప్రజలకు నచ్చిన బ్రాండ్లు దొరకకుండా చేసి, నాసిరకం మద్యం విక్రయించారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడంపై కూడా ఆంక్షలు విధించారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ విధానాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు సృష్టించిన వారే ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులపై కూడా సోమిరెడ్డి ప్రస్తావించారు. సీబీఐ కేసులు, వేల కోట్ల అవినీతి ఆరోపణల్లో జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని చెప్పారు. ఈ కేసుల విచారణ వేగవంతం అవుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
నిన్న వైసీపీ చేపట్టిన ధర్నా కార్యక్రమాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజల నుంచి స్పందన రాలేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. చాలా చోట్ల కొద్దిమంది మాత్రమే పాల్గొన్నారని, సొంత పార్టీ నాయకులే ఈ కార్యక్రమాలపై అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.