ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన రవాణా మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు రూపుదిద్దుకుంటుండటంతో సరుకు, ప్రయాణికుల రవాణా సౌలభ్యం పెంచే దిశగా హైవేల అభివృద్ధికి వేగం పెంచుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారులతో పాటు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకువెళుతోంది. ఈ క్రమంలో తాజాగా ఖరగ్‌పూర్ – కటక్ – విశాఖపట్నం – అమరావతి వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. మొత్తం 446 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సరుకు రవాణా మరింత సులభతరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం కోల్‌కతా – చెన్నై జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై వాహనాల రద్దీ తీవ్రమైన స్థాయికి చేరింది. ముఖ్యంగా ఒంగోలు – కత్తిపూడి మధ్య ట్రాఫిక్ ఒత్తిడి లాజిస్టిక్స్ రంగానికి అడ్డంకిగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడంతో పాటు అమరావతికి ఖరగ్‌పూర్, కటక్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో మెరుగైన అనుసంధానం కల్పించాలనే లక్ష్యంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను కేంద్రానికి ప్రతిపాదించనున్నారు. ఈ రహదారి కృష్ణా, ఏలూరు, పోలవరం, చింతపల్లె, పాడేరు, పార్వతీపురం మన్యం మీదుగా ఒడిశాలోని కటక్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వరకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ హైవేను అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో కూడా అనుసంధానం చేయనున్నారు.
ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించిన డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ సిద్ధం చేస్తోంది. డీపీఆర్ పూర్తైన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి, ఆమోదం లభించిన తర్వాత టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ఎన్‌హెచ్–16కు ప్రత్యామ్నాయంగా ఒంగోలు – కత్తిపూడి వయా చీరాల జాతీయ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించాలనే ప్రతిపాదనను కూడా కేంద్రానికి పంపింది. ఈ రహదారి విస్తరణ పూర్తైతే తీర ప్రాంత పరిశ్రమలు, పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్‌కు భారీగా ఉపయోగపడనుంది.
ఇక విశాఖపట్నం – రాయ్‌పూర్ జాతీయ రహదారి పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ హైవేను వచ్చే ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా చూస్తే జాతీయ రహదారులు, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల అభివృద్ధితో అమరావతిని ఒక కీలక లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలు, ఎగుమతులు, పెట్టుబడులకు బలమైన కనెక్టివిటీ కల్పించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా ఉంది.