తిరువనంతపురం లోని ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2025–26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీ నియామకాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈసారి ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ప్రత్యక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయనుండటం ప్రత్యేకతగా మారింది. ఈ కారణంగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల అభ్యర్థుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 23, అలాగే డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 67 ఖాళీలుగా ప్రకటించారు. అర్హతలుగా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. తుదిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా హాజరవ్వచ్చు అన్న సౌకర్యం ఇవ్వడం మరింత ఆకర్షణగా మారింది. అయితే ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ పొందిన అభ్యర్థులు మాత్రం ఈ డ్రైవ్‌కు అర్హులు కారు.
అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2025 నాటికి 28 ఏళ్లకు మించరాదు. అదనంగా, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ–ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. మొదటగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, దరఖాస్తు ప్రతిని తీసుకొని డిసెంబర్ 29, 2025న ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇంటర్వ్యూ రోజే దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాత పరీక్ష లేకపోవడంతో ఎంపిక పూర్తిగా విద్యార్హతలు + ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా జరుగుతుంది.
ఎంపికైన అప్రెంటిస్ వారికి నెలకు గ్రాడ్యుయేట్లకు ₹9,000 స్టైపెండ్, డిప్లొమా అభ్యర్థులకు ₹8,000 స్టైపెండ్ చెల్లిస్తారు. దేశంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థలో శిక్షణ పొందే అవకాశం కావడంతో ఈ నోటిఫికేషన్‌కు భారీ స్పందన రావచ్చని అంచనా.