అమెరికా వెళ్లే ముందు అబుదాబి విమానాశ్రయంలో ఓ భారతీయుడు ఎదుర్కొన్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి విమానాశ్రయంలో అమెరికా ప్రీ క్లియరెన్స్ సెంటర్ వద్ద తన లగేజీని తనిఖీ చేసిన అధికారులు, అతడు తీసుకెళ్తున్న ఆహార పదార్థాలపై అనుమానం వ్యక్తం చేశారు. పరిశీలనలో పంది మాంసం ఫ్రై, కొన్ని రకాల ఊరగాయలు ఉన్నాయని గుర్తించారు. వీటి గురించి ముందే వెల్లడించకపోవడంతో, ఆ ప్రయాణికుడికి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు 300 డాలర్ల జరిమానా (సుమారు ₹25,000) విధించారు.
ప్రయాణికుడు తన సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను తీసుకెళ్తున్న ఆహార పదార్థాల జాబితాలో పంది మాంసం ఉందని చెప్పడం మరిచిపోయానని వివరించాడు. అది పెద్ద తప్పు అనిపించకపోయినా, అమెరికా నియమాల ప్రకారం ఇది “ఆహార డిక్లరేషన్ ఉల్లంఘన” కింద వస్తుందని చెప్పాడు. జరిమానా వేసిన తర్వాత తన వీసా లేదా H-1B స్టాంపింగ్‌పై దీని ప్రభావం ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు.
అతడు తెలిపిన వివరాల ప్రకారం, CBP అధికారులు ప్రారంభ తనిఖీలో ఊరగాయలు, స్నాక్స్, మసాలా పొడులు ఉన్నాయని తెలుసుకున్నారు. మరింతగా అడగడంతో బీఫ్, చేపలతో చేసిన ఊరగాయలు ఉన్నాయని వెల్లడించాడట. దీంతో అధికారులు రెండోసారి లగేజీ తెరిచి తనిఖీ చేయగా, పంది మాంసం ఫ్రై ప్యాకెట్ బయటపడింది. సీల్ లేకపోవడంతో, అది ఇంట్లో తయారు చేసిన ఆహారమని నిర్ధారించి జరిమానా విధించారు. కానీ చేపల పికిల్ మాత్రం సీల్ చేయబడి ఉండటంతో దానిని అనుమతించారు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. పలువురు నెటిజన్లు అమెరికా నియమాలు చాలా కఠినంగా ఉంటాయని, అలాంటి ఆహార పదార్థాలను డిక్లేర్ చేయకపోతే తప్పనిసరిగా ఫైన్ వేస్తారని చెప్పారు. కొందరు ఈ జరిమానా అతని వీసాపై ప్రత్యక్ష ప్రభావం చూపదని పేర్కొన్నారు కానీ CBP రికార్డుల్లో ఇది నమోదవుతుందని, భవిష్యత్తులో అతడు అదనపు తనిఖీకి గురయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా విదేశాలకు బయలుదేరే ప్రయాణికులు తీసుకెళ్తున్న ఆహార పదార్థాలన్నింటినీ స్పష్టంగా డిక్లేర్ చేయాలని నిపుణులు సూచించారు.