భారత్ ఒమాన్ సంబంధాల్లో చరిత్రాత్మక ఘట్టానికి తాజాగా శ్రీకారం చుట్టింది. భారత ప్రధానమంత్రి మోడీకి ఒమాన్ దేశం అత్యున్నత గౌరవంగా భావించే ‘ఆర్డర్ ఆఫ్ ఒమాన్ – ఫస్ట్ క్లాస్’ పురస్కారం ప్రదానం చేయడం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న ఆత్మీయత, విశ్వాసాన్ని మరోసారి చాటింది. ఈ గౌరవం కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన పురస్కారం మాత్రమే కాదు, భారతదేశ ప్రజలందరికీ, రెండు దేశాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధానికి దక్కిన గుర్తింపుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఒమాన్ సుల్తాన్ హైథం బిన్ తారిక్‌కు, అక్కడి ప్రభుత్వం మరియు ప్రజలకు భారత ప్రధాని మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భారత్–ఒమాన్ మధ్య ఉన్న స్నేహబంధం కొత్తది కాదని, శతాబ్దాల క్రితమే ఈ సంబంధాలకు బలమైన పునాదులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. మన పూర్వీకులు సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం చేస్తూ, మాండ్వి నుంచి మస్కట్ వరకు ప్రయాణాలు చేశారని, ఆ అరేబియా సముద్రమే ఈ రెండు దేశాల మధ్య బలమైన వారధిగా మారిందని చెప్పారు. ఈ గౌరవాన్ని భారత ప్రజలకు, అలాగే ఈ సంబంధాలకు బీజం వేసిన మన పూర్వీకులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. సముద్ర వాణిజ్యం ద్వారా రెండు దేశాల అభివృద్ధికి తోడ్పడ్డ నావికులకు కూడా ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు.
ఒమాన్ సుల్తాన్ హైథం బిన్ తారిక్‌తో జరిగిన భేటీ అత్యంత సానుకూలంగా సాగిందని భారత ప్రధాని మోడీ వెల్లడించారు. ఒమాన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న సుల్తాన్ దూరదృష్టిని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో ఒమాన్ కొత్త ఎత్తులకు చేరుకుంటోందని ప్రధాని అన్నారు. ఈ భేటీలోనే భారత్–ఒమాన్ మధ్య చారిత్రాత్మక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, అంటే సీఈపీఏ (CEPA)పై సంతకాలు జరగడం విశేషం. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంలో స్వర్ణ అధ్యాయంగా నిలవనుందని అభిప్రాయపడ్డారు.
సీఈపీఏ ఒప్పందం ద్వారా భారత్–ఒమాన్ సంబంధాలు 21వ శతాబ్దంలో కొత్త ఊపును అందుకుంటాయని అంచనా వేస్తున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, వివిధ రంగాల్లో సహకారం మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువతకు ఈ ఒప్పందం ద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, పరిశ్రమలు వంటి రంగాల్లో రెండు దేశాల యువతకు ఇది ఉపయోగపడనుందని చెప్పారు.
ఈ పర్యటన సందర్భంగా ఒమాన్ ప్రభుత్వం, ప్రజలు చూపిన ఆతిథ్యానికి ప్రధాని మోడీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. సీఈపీఏ ఒప్పందం ఈ పర్యటనలో ప్రధాన ఫలితంగా నిలిచిందని, ఇది భవిష్యత్ తరాలకు కూడా మేలు చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు ఇతర రంగాల్లో కూడా గణనీయమైన చర్చలు జరిగాయని తెలిపారు.
ఈ పర్యటన భారత్–ఒమాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక మైలురాయిగా మారింది. చారిత్రక అనుబంధం, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలు అన్నింటినీ కలిపి ఈ స్నేహబంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం కాలక్రమేణా మరింత పటిష్టమవాలని, శాంతి, అభివృద్ధి, సహకారం దిశగా కలిసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తమైంది.