బాలీవుడ్ సినిమా ప్రపంచంలో గత కొంతకాలం నుండి సూపర్ హిట్ సినిమా లేదని చెప్పుకోవాలి కాగా ఇటు వలె విడుదలైన ‘ధురంధర్’ మాత్రం సినిమా ప్రేక్షకులను బాగా ఆకర్షింప చేస్తుంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించగా, తాజాగా విమర్శకుల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
రామ్ గోపాల్ వర్మ ‘ధురంధర్’ను కేవలం ఒక సినిమా అని చూడటం తప్పు ఇది భారతీయ సినిమాకు ఒక కొత్త దిశను చూపించే మైలురాయి అని అభివర్ణించారు. ఈ చిత్రం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని, ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ కథను ఎక్కడా నీరసపరచకుండా ప్రేక్షకుల తెలివితేటలపై నమ్మకం ఉంచి తెరకెక్కించాడని ప్రశంసించారు. సాధారణంగా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరనే భావనతో కథలను సులభతరం చేసే ప్రయత్నం చాలామంది దర్శకులు చేస్తారని కానీ ఆదిత్య ధర్ అలాంటి రాజీ పడలేదని వర్మ వ్యాఖ్యానించారు.
‘ధురంధర్’లో ప్రతి సన్నివేశం కేవలం చూపించడానికే కాదు, ప్రేక్షకుల మనసుల్లో ఒక భావోద్వేగ స్థితిని సృష్టించేలాగా ఉందని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. తొలి ఫ్రేమ్ నుంచే ఏదో తిరిగి మార్చలేని సంఘటన మొదలైందనే భావన కలుగుతుందని, ప్రేక్షకుడు కేవలం వీక్షకుడిగా కాకుండా కథలో భాగస్వామిగా మారిపోతాడని చెప్పారు.
కథనం విషయంలోనూ వర్మ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సినిమాలో డైలాగులు, నిశ్శబ్దాలు, నేపథ్య శబ్దాలు అన్నీ కూడా ఆయుధాల్లా ఉపయోగించబడ్డాయని అన్నారు. శబ్ద ప్రభావాలు కేవలం అలంకరణ కోసం కాకుండా, సన్నివేశాల ఒత్తిడిని పెంచేలా ఉన్నాయని చెప్పారు. ప్రతి సీన్ ఒక స్ప్రింగ్‌లా బిగుసుకుపోయి, ఎప్పుడు పేలుతుందో తెలియని ఉత్కంఠను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఆ పేలుడు వచ్చినప్పుడు అది కేవలం హింసాత్మకంగా కాకుండా, భావోద్వేగపరంగా కూడా ప్రేక్షకులను కుదిపేస్తుందని వ్యాఖ్యానించారు.
నటీనటుల నటనపై కూడా రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలనే ఉద్దేశంతో రూపొందించలేదని, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనసులో మిగిలిపోయేలా తీర్చిదిద్దారని చెప్పారు. పాత్రలు తమ గతాన్ని భుజాలపై మోస్తూ తెరపైకి వస్తాయని, వాటి కథను పూర్తిగా చెప్పకుండా ప్రేక్షకులే అర్థం చేసుకునేలా వదిలేయడం దర్శకుడి ధైర్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఈ ధైర్యమే ‘ధురంధర్’ను భారతీయ సినిమాకు ఒక మలుపుగా మార్చిందని అన్నారు.
కథ పరంగా చూస్తే, ‘ధురంధర్’లో రణవీర్ సింగ్ భారత గూఢచారిగా నటించారు. పాకిస్తాన్‌లోని ల్యారి ప్రాంతంలోకి చొరబడి, ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే పాత్రలో ఆయన నటనకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు బలం చేకూర్చారు.
మొత్తంగా ‘ధురంధర్’ ఒక ట్రెండ్‌ను అనుసరించే సినిమా కాదని, కొత్త ట్రెండ్‌ను సృష్టించే ప్రయత్నమని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమా విజయవంతం కావాలంటే తప్పనిసరిగా హాలీవుడ్‌ను అనుకరించాల్సిన అవసరం లేదని, మన నేలపై నిలబడి కూడా అంతర్జాతీయ స్థాయికి చేరవచ్చని ఈ చిత్రం నిరూపించిందని అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడు కేవలం ఎంటర్టైన్ అయ్యాననే భావనతో కాకుండా, ఏదో మారిపోయాననే అనుభూతితో బయటకు వస్తాడని వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు ‘ధురంధర్’ చుట్టూ ఉన్న హైప్‌ను మరింత పెంచుతున్నాయి.