ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. శుక్రవారం ఉదయం పరిస్థితి మరింత తీవ్రంగా మారి, కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించని స్థితి నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీకి పాటు పరిసర ప్రాంతాల్లో విజిబిలిటీ భారీగా తగ్గడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం పూట వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొగమంచు తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగుతుందని హెచ్చరించింది. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించింది.
పొగమంచు ప్రభావం వాయు రవాణాపై తీవ్రంగా పడింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సినవి, అక్కడికి చేరాల్సినవి కలిపి 150కి పైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. అలాగే మరో 200కు పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దీని వల్ల ప్రయాణికులు విమానాశ్రయంలో గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది.
రైల్వే, రోడ్డు రవాణా కూడా ఈ పొగమంచు కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడవగా, హైవేలపై వాహనాల వేగం గణనీయంగా తగ్గింది. ప్రమాదాల ముప్పు ఉన్నందున ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని హెచ్చరిస్తున్నారు.
ఈ అంతరాయాలు ఇంకా కొనసాగవచ్చని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. వాతావరణం పూర్తిగా మెరుగుపడే వరకు విమాన సర్వీసుల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రయాణానికి ముందు విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.