ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద జారీ చేసిన జాబ్ కార్డులు రికార్డు స్థాయిలో రద్దయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఏకంగా 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి. ముఖ్యంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య కేవలం ఐదు వారాల వ్యవధిలోనే 11.07 లక్షల జాబ్ కార్డులు తొలగించబడటం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ కాలంలో రద్దైన మొత్తం జాబ్ కార్డుల్లో 68 శాతం ఒక్క ఏపీ నుంచే ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఈ సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఈ ఐదు నెలల్లో మొత్తం 16.31 లక్షల జాబ్ కార్డులు మాత్రమే రద్దుకాగా, అందులో 11 లక్షలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే చెందడం గమనార్హం. జాబితాలో ఏపీ తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో కేవలం 95,084 కార్డులు మాత్రమే రద్దయ్యాయి. ఒడిశాలో 80,896, జమ్మూ కశ్మీర్‌లో 79,070 జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. మిగతా రాష్ట్రాల్లో కనీసం లక్ష కార్డులు కూడా రద్దుకాకపోవడం, ఏపీలో పరిస్థితి ఎంత భిన్నంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.
మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తరచుగా జాబ్ కార్డులపై సమీక్షలు నిర్వహిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ కార్డులను పరిశీలించి, మరణించినవారు, చాలా కాలంగా పనికి హాజరుకాని వారు, వలస వెళ్లిన కుటుంబాల కార్డులను తొలగించడం జరుగుతోంది. తాజాగా జాబ్ కార్డులకు కేవైసీ (KYC) తప్పనిసరి చేయడంతో పెద్ద సంఖ్యలో కార్డులు రద్దైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆధార్ వివరాలు సరిగా లేని వారు, డూప్లికేట్ ఎంట్రీలు, అర్హత లేని కుటుంబాలు ఈ ప్రక్రియలో తొలగిపోయినట్లు తెలుస్తోంది.
ఇక కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 51 లక్షల కుటుంబాలు, దాదాపు 90 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో నమోదు అయి ఉన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.7,707.21 కోట్లు విడుదల చేసినప్పటికీ, భారీ స్థాయిలో జాబ్ కార్డుల రద్దు కూలీల్లో ఆందోళన కలిగిస్తోంది. కూలీలకు పనిదినాలు తగ్గిపోతాయా? గ్రామీణ ఉపాధిపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.