అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త H-1B వీసా ఖర్చుల పెంపు భారత ఐటీ రంగంలో మరోసారి చర్చకు దారితీసింది. ఇప్పటికే వీసా ప్రక్రియలో క్లిష్టతలు, అనిశ్చితి ఉన్న నేపథ్యంలో ఈ అదనపు ఆర్థిక భారం కంపెనీలకు ఎలా ప్రభావం చూపుతుందనే ప్రశ్న ముందుకొచ్చింది. అయితే పెద్ద ఐటీ సంస్థలు దీన్ని తాత్కాలిక మార్పుగా చూస్తున్నాయని, మొత్తంగా వ్యాపారాన్ని దెబ్బతీసే అంత ప్రభావం ఉండదని నాస్‌కాం అధ్యక్షుడు నంబియార్ వివరించారు.
అమెరికాకు భారతీయ టెక్ టాలెంట్ ప్రవాహం గత రెండు దశాబ్దాలుగా నిరంతరం సాగుతోంది. ప్రతీ సంవత్సరం వేలాది మంది ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ నిపుణులు H-1B ద్వారా అక్కడి ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులు పెరిగితే సంస్థలు తగు వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరహా కంపెనీలకు ఇది ఆపరేషనల్ ఖర్చులు పెరగడానికి కారణమవుతుందనేది పరిశ్రమల అభిప్రాయం.
అయితే పెద్ద కంపెనీలకు మాత్రం ఈ ప్రభావం పరిమితమే ఇప్పటికే ఉన్న గ్లోబల్ డెలివరీ మోడళ్లు, ఆన్‌సైట్-ఆఫ్‌షోర్ బలమైన బృందాలు, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా రిసోర్స్ ప్లానింగ్ ఇవి ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని తగ్గిస్తాయని నంబియార్ వివరణ ప్రకారం అదనంగా H-1B వ్యవస్థలో సంవత్సరాలుగా మార్పులు జరుగుతున్నప్పటికీ, భారత ఐటీ రంగం నిరంతరం తన వ్యూహాలను సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతోందని ఆయన గుర్తుచేశారు.
కొత్త ప్రతిపాదనలో OPT ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న విద్యార్థులకు ఈ అదనపు ఫీజు వర్తించదని స్పష్టత వచ్చింది. ఇది విద్యార్థులకు చిన్న ఊరటనిచ్చింది. OPT విస్తరణతో H-1B దరఖాస్తులపై ఒత్తిడి కొంత తగ్గవచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
అమెరికా మార్కెట్ భారత ఐటీ కంపెనీలకు అత్యంత కీలకం. అందువల్ల ప్రతి పాలసీ మార్పు పై వీరి దృష్టి నిలుస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ క్లయింట్లు ఖర్చుల నియంత్రణపై దృష్టి పెట్టిన సమయంలో, వీసా ఖర్చుల పెంపు చిన్న మోతాదులో ప్రభావం చూపినప్పటికీ పెద్ద కంపెనీలు తమ బిజినెస్ మోడళ్లను మార్చాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి, H-1B వీసా ఖర్చుల పెంపు భారత ఐటీ ప్రయాణంలో ఒక చిన్న అడ్డంకిగా మాత్రమే కనిపిస్తోంది. బలమైన డిమాండ్, నైపుణ్యాల ఆధారిత ప్రాజెక్టులు, అమెరికా మార్కెట్‌పై కొనసాగుతున్న అవసరం ఈ అంశాలు ఐటీ రంగాన్ని ముందుకు నెడుతూనే ఉంటాయని నాస్‌కామ్ అభిప్రాయం.