విజయవాడ భవానీపురం పరిధిలోని జోజి నగర్‌లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. న్యాయస్థానం తాజా తీర్పు ఆధారంగా లక్ష్మీ రామా కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు 42 ప్లాట్లను ఖాళీ చేయించేందుకు భారీ పోలీసు భద్రతతో అక్కడికి చేరుకున్నారు. పొక్లెయిన్లను తెప్పించి మొత్తం 16 ఇళ్లను కూల్చివేశారు. ఈ చర్యతో స్థానికులు, ముఖ్యంగా మిగతా ప్లాట్ల యజమానులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులపై నిరసన వ్యక్తం చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ కూల్చివేతలు ప్రాంతంలో ఆందోళన వాతావరణాన్ని మరింత పెంచాయి.
తమ ఇళ్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు సితార సెంటర్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సమయంలో నిరసనలో పాల్గొన్న ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, పోలీసు సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. ఇక్కడి నిరసన కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేశారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ కూల్చివేతలు కొనసాగించారని బాధితులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదానికి దాదాపు రెండు దశాబ్దాల పాత చరిత్ర ఉంది. సుమారు 20 ఏళ్ల క్రితం స్థల యజమాని, లక్ష్మీరామా కోఆపరేటివ్ సొసైటీ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. అయితే సొసైటీ సభ్యులు తాము కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. దీంతో స్థల యజమాని ఆ సమయంలో అదే భుమిని మరో 42 మంది వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేసాడు. ఈ పరిణామం తర్వాత సొసైటీ సభ్యులు పదేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించారు. దీర్ఘకాల విచారణ అనంతరం ఇటీవల కోర్టు సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్లాట్లను స్వాధీనం చేసుకునే చర్యలకు వారు శ్రీకారం చుట్టారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో సొసైటీ సభ్యులు నిన్న ఉదయం నుంచే కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడం, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ కోసం తమ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారని తెలిసినా కూడా కూల్చివేతలు కొనసాగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది. అనేక కుటుంబాలు ఒక్కసారిగా స్థలచ్యతకు గురవడంతో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
మరోవైపు, బాధితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సాయంత్రానికి సుప్రీంకోర్టు అత్యవసరంగా స్పందించి ఇళ్ల తొలగింపు చర్యలను ఈ నెల 31 వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం రావడంతో ఉదయం నుండి భయాందోళనకు గురైన కుటుంబాలకు ఒకింత ఊరట లభించింది. ఒక్కరోజులోనే నాటకీయ మార్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు కొంత ఆశాభావంతో ఉన్నారు. సమస్యపై పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బాధితులు వెల్లడించారు.