ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పవిత్ర గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, ఆగమ, వైదిక పండితులు సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ తేదీలను ఖరారు చేసింది.
గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తం అంశంపై ఇటీవల దేవాదాయశాఖ అధికారులు విస్తృతంగా చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాలు, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలకు చెందిన ఆగమ, వైదిక పండితులతో పాటు టీటీడీ ఆస్థాన సిద్ధాంతి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పరిశీలించిన తర్వాత జూన్ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు నిర్వహించాలనే విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా దేవాదాయశాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ఏపీ ప్రభుత్వం గోదావరి పుష్కరాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
గతంలో 2015లో గోదావరి పుష్కరాలు జులై 14 నుంచి జులై 25 వరకు జరిగాయి. ఆ సమయంలో సుమారు 5.20 కోట్ల మంది భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గోదావరి నది ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ జిల్లాలన్నింటిలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత పుష్కరాల్లో ఏర్పాటు చేసిన 202 ఘాట్లకు మించి ఈసారి ఘాట్ల సంఖ్యను పెంచనున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా పరిధిలో పుష్కరాల కోసం రూ.5,704 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.