ఇటీవల బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కేసు ఊహించని మలుపు తీసుకుంది. గత ఏడాది దేశంలో జరిగిన తిరుగుబాట్లు వీటిని అణచడానికి ఆమె ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు ఆమెకే పెద్ద సమస్యగా మారాయి. హసీనా అప్పట్లో దేశం విడిచి భారత్‌కు వచ్చి ఆశ్రయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెపై విచారణ చేసిన అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తాజాగా మరణశిక్షను ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ హసీనాను వెంటనే తమకు అప్పగించాలని అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరింది.
ద్వైపాక్షిక నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం భారత్ ఈ బాధ్యతను నెరవేర్చాలన్నది ఢాకా విదేశాంగ శాఖ వాదన. గత ఏడాది జూలైలో జరిగిన హత్యలు, ఆ ఘటనలకు సంబంధించిన మానవత్వవ్యతిరేక నేరాల్లో హసీనా నేరస్తురాలని ట్రైబ్యునల్ తేల్చిందని బంగ్లాదేశ్ ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. హసీనాకు ఎలాంటి దేశం ఆశ్రయం ఇస్తే, అది న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టే అవుతుందని కూడా ధాకా హెచ్చరించింది. ఆమెతో పాటు ఆమె కుమారుడినీ భారత్ అప్పగించాలని స్పష్టమైన డిమాండ్ చేసింది.
ఒక వైపు బంగ్లాదేశ్ ఈ అంశాన్ని అత్యవసరమని పట్టుబడుతుండగా, మరో వైపు భారత విదేశాంగశాఖ కొద్దికాలం నిశ్శబ్దంగా పరిస్థితిని పరిశీలించింది. ఆ తరువాత విడుదల చేసిన ప్రకటనలో షేక్ హసీనా కేసుకు సంబంధించిన తీర్పును గమనించామని తెలిపింది. పొరుగు దేశ ప్రజల శాంతి, స్థిరత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారత్ కట్టుబడి ఉందని చెప్పినా… బంగ్లాదేశ్ కోరిన “అప్పగింత” విషయంపై మాత్రం ప్రత్యక్ష సమాధానం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డది. ధాకాలోని అన్ని పక్షాలతో మాట్లాడి పరిస్థితిని అంచనా వేస్తామని మాత్రమే స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఆసియా రాజకీయాల్లో కీలక చర్చాంశంగా మారింది. హసీనా ఇప్పుడు భారత్‌లో ఉన్న నేపథ్యంలో, ఆమెను అప్పగించాలా? లేక మానవ హక్కుల అంశంపై ధాకా తీర్పును పునఃపరిశీలించాలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ కేసుపై దృష్టిపెట్టాయి. మరణశిక్ష విధించిన తీర్పు న్యాయపరమైన ప్రమాణాలకు అనుగుణమా లేదా అన్న అంశం కూడా చర్చకు వచ్చింది. హసీనా అనుచరులు ఈ తీర్పును రాజకీయంగా ప్రేరేపించబడిందిగా అభివర్ణిస్తున్నారు.
భారత్ ప్రస్తుతం అత్యంత సున్నితమైన సమతుల్యతను పాటిస్తోంది. ఒకవైపు పొరుగు దేశంతో ఉన్న ఒప్పందాల గౌరవం మరో వైపు మానవ హక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ ఒత్తిడుల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బంగ్లాదేశ్ “తక్షణం అప్పగింత” అంటూ స్పష్టం చేస్తుండగా, భారత్ మాత్రం పరిస్థితిని సమీక్షిస్తూ, దౌత్యపరమైన చర్చలతో ముందుకు సాగుతోంది. చివరికి హసీనా భవిష్యత్తు ఏ దిశగా వెళ్లబోతుందో, రెండు దేశాల సంబంధాలపై ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుందో అన్నది ముందున్న రోజులు నిర్ణయించబోతున్నాయి.