ఇప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న H-1B వీసా నియమాల పైన తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, భారతదేశంలోని టెక్ రంగానికి పరోక్షంగా లాభాలను కలిగించనట్టుగా కనిపిస్తున్నాయి. ఇటీవల H-1B వీసా దరఖాస్తు ఫీజులను క్రమంగా పెంచడం, అలాగే కొత్త బిల్లులు ప్రవేశపెట్టడం వలన అమెరికాలో విదేశీ నిపుణులను నియమించడం కంపెనీలకు వ్యయభరితంగా, సంక్లిష్టంగా మారింది. ఫలితంగా, అమెరికన్ కంపెనీలు తమ కీలకమైన ప్రాజెక్టులు, అత్యున్నత స్థాయి టెక్నాలజీ పని కేంద్రాలను భారత్‌లోని తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ద్వారా నిర్వహించడం ప్రారంభించాయి. ఆర్థిక నిపుణులు మరియు పారిశ్రామిక వర్గాలు ఈ పరిణామం భారత జీసీసీల అభివృద్ధికి పెద్ద ఊతమిచ్చేలా ఉందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల అమెరికా ప్రభుత్వం H-1B వీసా ఫీజును ప్రస్తుతం 2,000-5,000 డాలర్ల నుండి ఏకంగా 1 లక్ష డాలర్ల వరకు పెంచింది. అదే సమయంలో కొందరు యూఎస్ సెనేటర్లు H-1B, L-1 వీసా ప్రోగ్రామ్‌ల లోపాలను సరిదిద్దడానికి కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఈ పరిణామాలతో అమెరికాలో విదేశీ నిపుణులను నియమించడం సంస్థలకు మరింత ఖర్చుతో కూడిన, సంక్లిష్టమైన పని అయ్యింది. అందువల్ల, అమెరికన్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించడం ప్రారంభించాయి. ప్రధానంగా, భారత్‌లో ఇప్పటికే స్థాపించబడిన జీసీసీలకు మార్పిడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,700కు పైగా జీసీసీలలో సగం అంటే దాదాపు అన్ని కేంద్రాలు భారత్‌లోనే ఉన్నాయి. ఇవి కేవలం టెక్ సపోర్ట్ కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రాడక్ట్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వంటి అత్యంత కీలకమైన విభాగాల్లోనూ పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అమెరికన్ కంపెనీలు వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం నిపుణులను భారతీయ జీసీసీలలో నియమించడం ద్వారా వ్యయాన్ని తగ్గించుకునే అవకాశాన్ని పొందుతున్నాయి.
డెలాయిట్ ఇండియా భాగస్వామి రోహన్ లోబో మాట్లాడుతూ, "ఈ సమయంలో జీసీసీలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే పలు అమెరికన్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసులు, టెక్నాలజీ రంగాల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని అన్నారు. అంతేకాక, ANSR వ్యవస్థాపకుడు లలిత్ అహూజా కూడా, "ఈ పరిణామంపై కంపెనీల మధ్య తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలనే ఆత్రుత కనిపిస్తోంది" అని తెలిపారు. నిపుణుల అంచనా ప్రకారం, ఈ విధమైన వీసా నిబంధనలు కొనసాగితే, అమెరికాలోని వ్యూహాత్మక ఉద్యోగాలు కూడా భారతదేశానికి తరలించబడే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెబుతున్నారు.