అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై కొత్త వాణిజ్య చర్యలను ప్రకటించారు. ఆయన నవంబర్ 1 నుంచి చైనా నుంచి దిగుమతి అవుతున్న అన్ని ఉత్పత్తులపై 100 శాతం అదనపు సుంకం (టారిఫ్) విధించనున్నట్లు చెప్పారు. అలాగే అమెరికాలో తయారయ్యే ముఖ్యమైన సాఫ్ట్‌వేర్‌ల ఎగుమతిపై కూడా కఠిన నియంత్రణలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉంది.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేస్తూ, చైనా అత్యంత దూకుడైన వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. అమెరికా దీన్ని కఠినంగా ఎదుర్కొంటుందని హెచ్చరించారు.
2025 నవంబర్ 1 నుంచి అమెరికా చైనాపై ప్రస్తుత సుంకాలపై అదనంగా 100 శాతం టారిఫ్ విధిస్తుంది. అదే రోజు అమెరికాలో తయారయ్యే క్రిటికల్ సాఫ్ట్‌వేర్‌లపై ఎగుమతి నియంత్రణలు అమలు చేస్తాం అని ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ తెలిపిన దాని ప్రకారం చైనా తమ ఉత్పత్తులపై విస్తృత ఎగుమతి పరిమితులను అమలు చేయాలని యోచిస్తోందన్న నివేదికలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో మానవతా విలువలకు విరుద్ధమైన పని అని పేర్కొన్నారు.
ట్రంప్ మాట్లాడుతూ ఇటీవల చైనా ప్రపంచానికి ఒక శత్రుత్వపూరిత లేఖ పంపింది. అందులో వారు నవంబర్ 1, 2025 నుండి దాదాపు అన్ని ఉత్పత్తులపై ఎగుమతి నియంత్రణలు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ నియంత్రణలు అన్ని దేశాలపైనా ప్రభావం చూపుతాయి. కొన్ని ఉత్పత్తులు చైనాలో తయారు కానప్పటికీ వాటిపైనా నియంత్రణలు ఉంటాయని వారు చెప్పారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని చర్య అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ – షీ భేటీ రద్దు సూచన ఇక మరో పోస్టులో ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తో జరగబోయే తన సమావేశాన్ని రద్దు చేయవచ్చని సూచించారు. నేను రెండు వారాల్లో దక్షిణ కొరియాలో జరిగే APEC సమావేశంలో షీని కలవాల్సి ఉంది. కానీ ఇప్పుడు దానికి అవసరం కనిపించడం లేదు అని పేర్కొన్నారు.
ఈ ప్రకటనలతో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు మరింత గడ్డకట్టే అవకాశం ఉంది. గతంలో కూడా ట్రంప్ ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించింది. ఇప్పుడు మరోసారి 100 శాతం టారిఫ్ విధించడం ద్వారా వాణిజ్య యుద్ధం మళ్లీ చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక నిపుణుల ప్రకారం, ఈ చర్యలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది. రెండు దేశాలు పరస్పరం ఆంక్షలు, సుంకాలు విధిస్తే, దాని ప్రభావం ఇతర దేశాలపై కూడా పడుతుంది. ముఖ్యంగా టెక్ రంగం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్ ఎగుమతులు వంటి రంగాలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.