విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని హిమాలయ బార్ వద్ద వెల్డింగ్ షాప్‌లో ఆక్సిజన్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయిన కొద్దిసేపటికే సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు అంత శక్తివంతంగా ఉండటంతో షాపులో ఉన్న వ్యక్తులు తునాతునకలయ్యారు. ముగ్గురు వ్యక్తులు ఘటన స్థలంలోనే మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. వీరిలో కొందరిని కేజీహెచ్‌కి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పేలుడు ధాటికి షాపు పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిని గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. ఈ దృశ్యాలు స్థానికులను భయానక పరిస్థితిలోకి నెట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో స్క్రాప్ షాప్‌లో వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన మరలా నగరంలో సురక్షిత విధానాలపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సిలిండర్ భద్రతా ప్రమాణాలు, పరిశ్రమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది.