అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని ఆశపడే వారికి ఈబీ-5 (EB-5) వీసా ఉత్తమ మార్గమని అమెరికాకు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఇల్యా ఫిష్కిన్ తెలిపారు. పెట్టుబడుల ద్వారా గ్రీన్‌కార్డ్ పొందే ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ సంస్థ హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమం తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో జరిగింది. పలు ఆసక్తిగల పెట్టుబడిదారులు, వీసా అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఇల్యా ఫిష్కిన్‌తో పాటు ఈబీ-5 ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ భాగస్వాములు సుబ్బరాజు పేరిచర్ల, సంపన్ మల్హోత్రా పాల్గొన్నారు. ట్రంప్ పాలనలో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో ప్రస్తుతం అనేకమంది భారతీయులు ఈబీ-5 వీసా పథకాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వారికి ఇది అత్యంత సులభమైన మరియు భద్రమైన మార్గమని వివరించారు.
సుబ్బరాజు మరియు సంపన్ మల్హోత్రా ఈబీ-5 వీసా అర్హతలు, నిబంధనలను వివరించారు. దరఖాస్తుదారులు మొదట ఫార్మ్ I-526 పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. అమెరికా ప్రభుత్వం గుర్తించిన టార్గెటెడ్ ఎంప్లాయ్‌మెంట్ ఏరియా (TEA) లో కనీసం 8 లక్షల డాలర్లు (సుమారు ₹6.7 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. ఇతర ప్రాంతాల్లో అయితే పెట్టుబడి 10.5 లక్షల డాలర్లు (సుమారు ₹8.7 కోట్లు) ఉండాలి.
అదే విధంగా, కనీసం 10 మంది అమెరికా పౌరులకు ఉద్యోగాలు కల్పించే సంస్థను ఏర్పాటు చేసినా ఈ వీసాకు అర్హత లభిస్తుందని తెలిపారు. అర్హత సాధించిన వారికి మొదట రెండేళ్ల షరతులతో కూడిన గ్రీన్‌కార్డ్ మంజూరు చేస్తారు. ఆ తర్వాత ఫార్మ్ I-829 ద్వారా శాశ్వత గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.