తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ నుంచి మరో కొత్త డిజిటల్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇకపై భక్తులు తమకు కావాల్సిన తిరుమల దేవస్థాన సేవల వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. భక్తుల సౌలభ్యం కోసం ఈ నూతన సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
తాజాగా విడుదలైన వివరాల ప్రకారం, భక్తులు తమ మొబైల్ నుంచి టైప్ చేసి టీటీడీ వాట్సాప్ నంబర్‌కు పంపితే సరిపోతుంది. వెంటనే తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివిధ సేవల ఆప్షన్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భక్తులు తాము తెలుసుకోవాలనుకునే వివరాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ సేవ ద్వారా ప్రస్తుతం అందించబడుతున్న ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది.
సర్వదర్శనం టోకెన్ల స్థితి: ప్రస్తుతం ఎంతమంది భక్తులు దర్శనానికి టోకెన్లు పొందారో, కొత్త టోకెన్లు ఎప్పుడు లభిస్తాయో తెలుసుకోవచ్చు.
మెట్టు మార్గం టికెట్ల లభ్యత: శ్రీవారి పాదాల మీదుగా వెళ్లే భక్తుల కోసం మెట్టు మార్గంలో ఉన్న టోకెన్ల సంఖ్య, మిగిలిన టికెట్ల వివరాలు రియల్‌టైమ్‌లో తెలుస్తాయి.
కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తుల సంఖ్య: తిరుమలలోని వివిధ కంపార్ట్మెంట్లలో ప్రస్తుతం ఉన్న రద్దీ స్థాయిని కూడా తెలుసుకోవచ్చును.
శ్రీవాణి టికెట్ల వివరాలు: శ్రీవాణి ట్రస్ట్ ద్వారా లభించే టికెట్ల లైవ్ అప్‌డేట్స్ ఈ సదుపాయం ద్వారా అందుబాటులో ఉంటాయి.
ముందస్తు డిపాజిట్ రీఫండ్ స్థితి: భక్తులు ఆన్‌లైన్ లేదా కౌంటర్ ద్వారా చేసిన డిపాజిట్ల రీఫండ్ స్టేటస్‌ను కూడా నేరుగా ఈ సేవ ద్వారా తెలుసుకోవచ్చు.
డిజిటల్ యుగంలో ప్రతి సేవను ప్రజల దరిదాపుల్లోకి తీసుకురావడమే లక్ష్యం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు భక్తులు ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా, తిరుమల సేవలకు సంబంధించిన సమాచారాన్ని తమ మొబైల్‌లోనే పొందవచ్చు. ఇది కేవలం సమాచారం అందించే ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాకుండా, భవిష్యత్తులో దీన్ని ట్రాన్సాక్షనల్ సేవలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అంటే భక్తులు త్వరలోనే దర్శనం లేదా వసతి బుకింగ్స్ కూడా నేరుగా వాట్సాప్ ద్వారా చేయగల అవకాశముంది.
ఇప్పటికే ప్రభుత్వ విభాగాల్లో వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ అమలులో ఉంది. విద్యుత్ బిల్లులు, నీటి పన్నులు, ఆర్‌టీసీ సర్వీసులు వంటి అనేక రంగాల్లో ఈ విధానం ప్రజాదరణ పొందుతోంది. ఇప్పుడు టీటీడీ కూడా ఈ జాబితాలో చేరడంతో తిరుమల యాత్రికులకు మరింత సౌకర్యం కలగనుంది.

తిరుమలలో ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వస్తున్న నేపథ్యంలో, రద్దీని నియంత్రించడంలో, భక్తులకు సమయానుకూల సమాచారాన్ని చేరవేయడంలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించనుంది. టీటీడీ చైర్మన్ మరియు అధికారులు చెప్పారు. భక్తులకు సేవ చేయడం మన ధర్మం. టెక్నాలజీ ద్వారా భక్తుల సేవల సమర్థతను పెంచుతాం. తిరుమలలోని ప్రతి సదుపాయాన్ని పారదర్శకంగా, వేగవంతంగా అందించడమే మా లక్ష్యం.
దీంతో తిరుమల యాత్ర మరింత సులభతరం కానుంది. భక్తులు ఇక కౌంటర్ వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా, తమ మొబైల్‌లోనే కావలసిన వివరాలు తెలుసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. నిజంగా ఇది భక్తులకు దైవ సేవలో డిజిటల్ అడుగు అని చెప్పవచ్చు.