ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో శుభవార్తను అందజేసింది. ఇటీవలే మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, మరోసారి భారీ నియామకాల సన్నాహాలు ప్రారంభించింది. కేవలం ఐదు నెలల్లో నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు, ఫలితాలు, నియామక పత్రాలు – అన్నీ పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఇదే వేళ త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందనే వార్త ఉపాధ్యాయ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది.
విద్యాశాఖపై గురువారం (అక్టోబర్ 9) సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేశ్, అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఆయన నవంబరులో టెట్ నిర్వహించి, వచ్చే ఏడాది జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చిలో పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవుతోందని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. దీంతో ఉపాధ్యాయ నియామకాలపై మళ్లీ చురుకుదనం కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా, డీఎస్సీ 2025లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయుల శిక్షణ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమైంది. వారానికి పైగా సాగిన ఈ శిక్షణ ముగిసిన నేపథ్యంలో గురువారం నుంచి పోస్టింగ్‌ల కోసం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. శుక్రవారం వరకు ఇది కొనసాగనుంది. కౌన్సెలింగ్‌లో ప్లేస్‌మెంట్‌లు కేటాయించిన తర్వాత అక్టోబర్ 13 నుంచి కొత్త టీచర్లు తమ పాఠశాలల్లో హాజరవుతారు. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని మంత్రి సూచించారు. అంతేకాకుండా, ఉత్తమ ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు రాష్ట్రం నుంచి 78 మందిని సింగపూర్‌కు పంపనున్నట్లు ఆయన ప్రకటించారు.
మరోవైపు, టీచర్ల సమస్యల పరిష్కార దిశగా కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అంతర్ జిల్లాల బదిలీలు, భాషా పండిట్స్ సమస్యలపై మంత్రి లోకేశ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు తమ ఆందోళనలను వివరించగా, వాటిని పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. “ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దడం నా లక్ష్యం, అందుకు టీచర్ల సహకారం అత్యంత అవసరం,” అని లోకేశ్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన అభినందించారు. తన సమస్యలు పరిష్కరించినందుకు టీచర్లు మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.