ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రూ.4600 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో సెమీకండక్టర్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా దేశంలో మొత్తం 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అందులో ఇప్పటివరకు ఆరు ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. తాజాగా మరో నాలుగు యూనిట్లకు అనుమతులు మంజూరు చేయబడ్డాయి.
ఈ కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులు SiCSem, Continental Devices India Pvt Ltd (CDIL), 3D Glass Solutions Inc, మరియు Advanced System in Package (ASIP) టెక్నాలజీస్ సంస్థలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ASIP సంస్థ దక్షిణ కొరియా APACT Co. Ltdతో భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 96 మిలియన్ యూనిట్ల సామర్థ్యంతో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ఉత్పత్తులు మొబైల్ ఫోన్లు, సెట్-టాప్ బాక్స్‌లు, ఆటోమొబైల్ అప్లికేషన్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఉపయోగపడతాయి.
కేంద్రమంత్రి వర్గం తెలిపిన వివరాల ప్రకారం, ఈ పెట్టుబడులు సుమారు 2034 నైపుణ్యం గల ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి. ఇక పరోక్షంగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సెమీకండక్టర్ రంగంలో ఈ పెట్టుబడులు భారతదేశ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో టెలికాం, ఆటోమోటివ్, డేటా సెంటర్ల, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో ఈ యూనిట్లు సహాయకారిగా ఉంటాయని కేంద్రం నమ్మకం వ్యక్తం చేసింది.