ఈ రోజుల్లో ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, భవిష్యత్తు కోసం డబ్బు సేవ్ చేయడం చాలా అవసరం. సాధారణంగా మనం డబ్బు సేవ్ చేస్తే అది అలాగే ఉండిపోతుంది. కానీ సరైన స్కీమ్‌లో పెట్టుబడి పెడితే అది పెరిగి పెద్ద ఫండ్‌గా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో పోస్టాఫీస్ స్కీమ్స్ (Post Office Schemes) మంచి ఎంపిక. ఎందుకంటే వీటిలో రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి.
ఈ స్కీమ్ పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). దీనికి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1%గా ఉంది. ఈ వడ్డీ సంవత్సరానికి కాంపౌండ్ అవుతుంది. అంటే మీరు సంపాదించిన వడ్డీపై మళ్లీ వడ్డీ వస్తుంది. దీన్నే “కాంపౌండింగ్ మ్యాజిక్” అంటారు. ఉదాహరణకు, మీరు నెలకు రూ.5,000 అంటే ఏటా రూ.60,000 సేవ్ చేస్తూ 25 ఏళ్లు పెట్టుబడి పెడితే, చివరికి రూ.16.27 లక్షల ఫండ్ మీ చేతిలోకి వస్తుంది.
PPF స్కీమ్‌లో 15 సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అంటే మధ్యలో డబ్బు తీసుకోవడం కష్టం. అయితే ఐదేళ్ల తర్వాత కొంత డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 15 ఏళ్లు పూర్తైన తర్వాత అకౌంట్‌ను ఐదేళ్ల బ్లాక్‌లలో కొనసాగించవచ్చు. ఈ బ్లాక్‌లో ఇన్వెస్ట్ చేయకపోయినా, అకౌంట్ ఉంచితే వడ్డీ వస్తూనే ఉంటుంది.
ఈ స్కీమ్‌లో పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తే, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాదు వడ్డీ, మెచ్యూరిటీ అమౌంట్ మీద కూడా ఎలాంటి టాక్స్ ఉండదు. అంటే మీరు సేవ్ చేసిన డబ్బు పెరుగుతూనే ఉంటుంది. దీని వల్ల పెట్టుబడి అలవాటు, ఆర్థిక క్రమశిక్షణ కూడా వస్తుంది.
PPF అకౌంట్‌ను పోస్టాఫీస్ లేదా నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తెరవొచ్చు. ఇందులో కనీసం సంవత్సరానికి రూ.500 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. లోన్ సదుపాయం కూడా ఉంటుంది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు వడ్డీ రేటు సవరిస్తుంది. కాబట్టి రిస్క్ లేకుండా, టాక్స్ ఫ్రీ రాబడి కోరుకునే పెట్టుబడిదారులకు PPF ఒక ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు.