ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి అర్హత గల కుటుంబానికి 2026 మార్చి నాటికి ఇళ్లు ఇవ్వాలని స్పష్టమైన గడువును నిర్ధేశించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY-1) కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోజుకు కనీసం 2,000 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన గట్టిగా చెప్పారు.
కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు, నిర్మాణ సంస్థలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కన్‌స్ట్రక్షన్ సైట్లను క్రమం తప్పకుండా పరిశీలించడం, కేంద్ర ప్రభుత్వంతో అనుమతుల కోసం సమన్వయం కలిగి ఉండటం ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. అలాగే మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశ వేడుకలను నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
అయితే ఈ ఇళ్ల నిర్మాణంలో కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి. ముఖ్యంగా PMAY ఆప్షన్-3 కింద లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు గ్రామాలు లేదా పట్టణాలకు దూరంగా ఉండటంతో వారు వెనుకంజ వేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, అధికారులు లబ్ధిదారులు, ఏజెన్సీలతో సమీక్షలు జరిపి, సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు 25 ప్రధాన ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు.
ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తోంది. ప్రతి ఇంటికి రూ.1.80 లక్షల వరకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ లభిస్తుండగా, అదనంగా తక్కువ వడ్డీతో రూ.25,000 లోన్ కూడా ఇవ్వబడుతోంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూ.50,000 అదనపు సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వర్గాలకు చెందిన దాదాపు 6 లక్షల కుటుంబాలు రూ.3,200 కోట్ల పైగా నిధులు పొందాయి.
గృహనిర్మాణంతో పాటు ప్రభుత్వం ఇళ్ల లేఅవుట్లను నివాసయోగ్యంగా మార్చేందుకు విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలను కూడా అందిస్తోంది. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో 6.70 లక్షల ఇళ్లు నిర్మిస్తే, ప్రస్తుత ప్రభుత్వం తక్కువ సమయంలోనే 2.86 లక్షల ఇళ్లు పూర్తి చేసింది. ఈ వేగాన్ని కొనసాగిస్తూ, 2026 మార్చి నాటికి రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు అందించడం ద్వారా ప్రజలకు పండగ వాతావరణం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.