రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక చర్య చేపట్టింది. ప్రభుత్వ సముదాయం (గవర్నమెంట్ కాంప్లెక్స్) సూక్ష్మ నమూనాను రూపొందించింది. హైదరాబాద్‌లో తయారైన ఈ నమూనా గురువారం విజయవాడకు రానుంది. ఈ నమూనాలో అమరావతి భవిష్యత్ రూపురేఖలు, ఆధునిక మౌలిక వసతులు, నిర్మాణాల ప్రతిరూపం స్పష్టంగా చూపించబడింది. రాజధాని నిర్మాణం పూర్తయ్యాక అమరావతి ఎలా ఉండబోతోందో ప్రజలు ప్రత్యక్షంగా తిలకించే అవకాశాన్ని ఇది కల్పించనుంది.
ఈ సూక్ష్మ నమూనాలో అసెంబ్లీ భవనం, హైకోర్టు, 50 అంతస్తుల జీఏడీ టవర్, అలాగే నాలుగు హెచ్వైడీ టవర్లు, మెట్రో లైన్లు, ఐకానిక్ తీగల వంతెన, ప్రధాన రవాణా సదుపాయాలు వంటి అనేక నిర్మాణాలను సమగ్రంగా చూపించారు. భవిష్యత్తులో అమరావతి నగరంలో ఏర్పడబోయే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, రవాణా కనెక్టివిటీ, మౌలిక వసతులపై ఈ నమూనా ఒక స్పష్టమైన దృశ్యాన్ని అందిస్తుందని అధికారులు తెలిపారు. ఇది కేవలం ఒక నమూనా కాకుండా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజధాని రూపకల్పనకు సంకేతమని భావిస్తున్నారు.
నరెడ్కో సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించబడుతున్న 11వ అమరావతి స్థిరాస్తి ప్రదర్శనలో ఈ నమూనాను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు అమరావతి నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారు. అమరావతి అభివృద్ధి సామర్థ్యాన్ని, పెట్టుబడి అవకాశాలను ఈ నమూనా ద్వారా మరింతగా ప్రదర్శించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రదర్శన అనంతరం, నమూనాను అమరావతిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో శాశ్వతంగా ఉంచనున్నారు. తద్వారా రాజధాని నిర్మాణంపై ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ దీన్ని సందర్శించి భవిష్యత్ నగర రూపురేఖలను తిలకించే వీలుంటుంది. అమరావతి అభివృద్ధి దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న కృషిని, ఆధునిక నగర నిర్మాణ దృక్పథాన్ని ఈ నమూనా ప్రతిబింబిస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.