రాయ్‌పూర్‌లో ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ చేరుకున్న ఏఐ 2797 విమానం ల్యాండ్ అయిన తర్వాత డోర్ సాంకేతిక సమస్య కారణంగా తెరుచుకోకపోవడంతో, ఓ ఎమ్మెల్యే సహా 160 మందికి పైగా ప్రయాణికులు గంటకు పైగా విమానంలోనే ఇరుక్కుపోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి స్వామి వివేకానంద విమానాశ్రయంలో కలకలం రేపింది.
వివరాల ప్రకారం, విమానం రాత్రి 8:15కి ఢిల్లీలో బయలుదేరి, 10:05కి రాయ్‌పూర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. కానీ, ల్యాండింగ్ తరువాత డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈ విమానంలో బిలాస్‌పూర్ జిల్లా కోట నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అటల్ శ్రీవాస్తవ కూడా ఉన్నారు.
దాదాపు గంటపాటు డోర్లు మూసివేయబడటంతో పాటు, సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. ఇదే సమయంలో విమానంలో పవర్ సప్లై నిలిచిపోవడం భయాన్ని మరింత పెంచింది. “ఇటీవలి విమాన ప్రమాదాల తర్వాత ఈ పరిస్థితి మాకు మరింత భయానకంగా అనిపించింది,” అని ఒక ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తరువాత సిబ్బంది స్పందించి, ఇది కేవలం సాంకేతిక లోపమేనని వివరణ ఇచ్చారు. అయితే, కొంతమంది అధికారులు ఇది భద్రతా డ్రిల్‌లో భాగమని చెప్పడంతో గందరగోళం మరింత పెరిగింది. చివరికి రాత్రి 11 గంటల తర్వాత సమస్యను పరిష్కరించి, ప్రయాణికులందరినీ సురక్షితంగా దిగిపోవడానికి అనుమతించారు.
ఈ ఘటనపై డీజీసీఏ సోమవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ, ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, ప్రయాణికులకు సమయానికి సమాచారం అందించడంలో విఫలమవుతున్న తీరు విమర్శలకు కారణమవుతోంది.