ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో తన విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తోంది. ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన నెలరోజుల వ్యవధిలోనే, సోమవారం దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో రెండవ షోరూమ్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఉన్న ఏరోసిటీలోని వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఇది కేవలం కార్ల విక్రయ కేంద్రం మాత్రమే కాకుండా, ఒక ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌గా రూపుదిద్దుకుంది. ఇక్కడ కస్టమర్లు టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దగ్గరగా పరిశీలించడమే కాకుండా, కొనుగోలు ప్రక్రియ, చార్జింగ్ ఆప్షన్లు, టెక్నికల్ వివరాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా మరియు పరిసర ప్రాంతాల కస్టమర్లకు ఇది సేవలందించనుంది. పండుగ సీజన్‌కు ముందే ప్రీమియం ఈవీ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలన్నదే టెస్లా వ్యూహం.
ప్రస్తుతం భారత మార్కెట్లో టెస్లా మోడల్ వైనే విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది – స్టాండర్డ్ రియర్-వీల్ డ్రైవ్ (RWD) ధర ₹59.89 లక్షలు, లాంగ్ రేంజ్ RWD ధర ₹67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). జులై నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, 2025 మూడవ త్రైమాసికం నుంచి డెలివరీలు మొదలవుతాయని అంచనా.
పనితీరు విషయానికి వస్తే – స్టాండర్డ్ మోడల్ ఒక్క చార్జ్‌తో 500 కిమీ రేంజ్ ఇస్తుంది, లాంగ్ రేంజ్ వేరియంట్ 622 కిమీ వరకూ ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం రెండింటికీ గంటకు 201 కిమీ. ఫాస్ట్ చార్జర్‌తో కేవలం 15 నిమిషాల్లోనే స్టాండర్డ్ మోడల్ 238 కిమీ, లాంగ్ రేంజ్ మోడల్ 267 కిమీ రేంజ్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.