గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం విజయవంతంగా అధికారంలోకి వచ్చింది. ఈ విజయానికి ఎన్నారైలు అందించిన సహకారం ఎంతో కీలకం. వారి మద్దతుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి వారం ఎన్నారైలతో సమావేశమై, వారి సేవలను గుర్తిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ వారంలో యూఏఈ, ఒమాన్, యూకే, ఆస్ట్రేలియా, మరియు కువైట్ దేశాల నుండి వచ్చిన ఎన్నారై ప్రతినిధులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశాన్ని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ సమన్వయం చేశారు. సీఎం గారు వారందరినీ ఆత్మీయంగా పలకరించి, వారి కుటుంబాలు, వృత్తులు, అలాగే వారు నివసిస్తున్న దేశాల్లోని పరిస్థితుల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.
వివరాలకు వస్తే, యూఏఈ నుండి మోహన్ మురళి, ఒమాన్ నుండి అనిల్, యూకే నుండి కీర్తి, ఆస్ట్రేలియా నుండి శ్యామ్ ప్రసాద్, కువైట్ నుండి శేఖర్ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. గల్ఫ్ దేశాల నుండి వచ్చిన ఎన్నారైలు విజయవాడ మరియు తిరుపతి నుండి గల్ఫ్‌కు నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించాలని అభ్యర్థించారు. యూకే నుండి వచ్చిన కీర్తి తన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించి పరిష్కారం కోసం సహాయం కోరారు.
ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఎన్నారై, అక్కడ ఉన్న అవకాశాలు తెలుగు యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం మరింత దృష్టి పెడితే విదేశాలలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సూచించారు.
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు చూపిన ఆత్మీయత, ప్రశాంత స్వభావం ఎన్నారైలందరినీ ఆకట్టుకుంది. ముఖ్యమంత్రితో ముఖాముఖి మాట్లాడే అవకాశం తమ జీవితంలో చిరస్మరణీయమైన అనుభవమని వారు పేర్కొన్నారు.