రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం కొత్త బార్ల కేటాయింపునకు ఇవాళ (ఆగస్టు 18) నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటి వరకు జిల్లాలో 11 బార్లు ఉండగా, కొత్త పాలసీ ప్రకారం మరో బార్‌ను కల్లుగీత కులానికి చెందిన వారికి కేటాయించనున్నారు. బి.కొత్తకోట వంటి పంచాయతీల్లో కూడా కొత్త బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో 2023లో ఈ-వేలం పద్ధతిలో బార్ల లైసెన్సులు కేటాయించారు. ఎక్కువ ధరకు బిడ్ వేసిన వారికి లైసెన్సులు ఇచ్చారు. అప్పట్లో ఒక్కో బార్ లైసెన్సు కోటి రూపాయల వరకు చేరింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొత్త విధానంలో లాటరీ పద్ధతిని అనుసరించి బార్ల లైసెన్సులు ఇవ్వనుంది. ఈసారి లైసెన్సు ఫీజు ఒక్కో బార్‌కు కేవలం రూ.55 లక్షలు మాత్రమే నిర్ణయించారు.
మదనపల్లె పట్టణంలోనే నాలుగు బార్లు ఉండగా, గత ప్రభుత్వానికి వాటి ద్వారా రూ.3.58 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు తక్కువ లైసెన్సు ఫీజు కారణంగా బార్ల కోసం పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో లైసెన్సులు ఎక్కువ మందికి లభించే అవకాశం ఉండి, ప్రభుత్వానికి కూడా మొత్తంగా ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
కొత్త పాలసీ ప్రకారం బార్ల లైసెన్సులు మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయి. ఈనెల 31వ తేదీకి పాత బార్ లైసెన్సులు రద్దవుతున్న నేపథ్యంలో, కొత్త విధానంతో లైసెన్సుల కేటాయింపు జరగనుంది. దీంతో జిల్లాలో బార్ల సంఖ్య పెరగడంతో పాటు, కొత్త వ్యాపారులు కూడా రంగప్రవేశం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.