పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ వాయుగుండం వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను దాటి, ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు పయనించనుందని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విదర్భ వద్ద మరో అల్పపీడనం కూడా కేంద్రీకృతమైంది. ఈ రెండు వ్యవస్థలు కలిసిపోవడంతో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. దీంతో బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్రపైకి విస్తారంగా తేమ గాలులు చేరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాయలసీమలో తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా వాతావరణశాఖ రెడ్, ఆరంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ప్రకాశం తదితర జిల్లాలకు ఆరంజ్ అలర్ట్, రాయలసీమలోని అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు భద్రతా సూచికలు ఎగురవేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని, ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే SDRF, NDRF బృందాలను రంగంలోకి దించాలని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 112, 1070, 18004250101 టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా విపత్తుల నిర్వహణ సంస్థను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.