తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల అంశం చర్చనీయాంశంగా మారింది. వేతనాలు పెంచకపోతే షూటింగ్లు నిలిపివేస్తామన్న ఫిల్మ్ ఫెడరేషన్ హెచ్చరికపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. ఇప్పటికే నిర్మాతలు కార్మికులకు ప్రస్తుత చట్టాల ప్రకారం కేటాయించాల్సిన కనీస వేతనాలకు మించిన పారితోషికాలు అందిస్తున్నారని స్పష్టం చేసింది.
ఫెడరేషన్‌తో ( Federation) ప్రత్యేక ఒప్పందాల అంశాన్ని ఖండించిన ఫిల్మ్ ఛాంబర్, ఇందుకు నిర్మాతలు ఒప్పుకోరాదని సూచించింది. వేతనాలపై తీసుకునే తుది నిర్ణయాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో చర్చించి ప్రకటిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు కీలక సభ్యులు హాజరవుతారని పేర్కొంది.
ఇక ఫెడరేషన్ చేపట్టిన సమ్మె నిర్ణయం, ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఛాంబర్ పేర్కొంది. షూటింగ్‌లు నిలిచిపోతే అప్పటికే ఖర్చు చేసిన మౌలిక వసతులు, సెట్స్, టెక్నిషియన్ల ఖర్చులు విషయాల్లో నిర్మాతలకు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని వివరించింది.
ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) అభిప్రాయం ప్రకారం, ఏ విషయంలోనైనా పరస్పర చర్చ ద్వారానే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పింది. కార్మికుల హక్కులు పరిరక్షించడంలోను, పరిశ్రమ కొనసాగింపులోను సమతౌల్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించింది.