రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఒక అద్భుతమైన, అదే సమయంలో భయానకమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శతాబ్దాలుగా నిశ్శబ్దంగా ఉన్న క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా ఉగ్రవిస్ఫోటనంతో బద్దలైంది. ఈ విస్ఫోటనంతో దాదాపు 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద, ధూళి ఆకాశంలోకి ఎగసింది.
కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ప్రభావంతోనే ఈ అగ్నిపర్వతం జ్వాలలు మళ్లీ చెలరేగాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. రష్యా అధికారుల ప్రకారం, బూడిద తూర్పు దిశగా పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతోంది. అదృష్టవశాత్తు, ఆ దిశలో జనావాసాలు లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటి వరకు ఎటువంటి నివాస ప్రాంతాల్లో బూడిద పడినట్లు నమోదు కాలేదు.
కమ్చట్కా వోల్కానిక్ ఎరప్షన్ రెస్పాన్స్ టీమ్ (KVERT) వెల్లడించిన వివరాల ప్రకారం, స్వల్ప స్థాయిలో ఇంకా కొన్ని విస్ఫోటనాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ విస్ఫోటనం జరుగుతున్న సమయంలోనే 7.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. దీంతో కమ్చట్కాలో కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడి, అనంతరం అవి వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రకంపనలు జపాన్, అలస్కా తీరాల్లో చిన్నపాటి సునామీ అలలను సృష్టించాయి.
"చారిత్రకంగా చూసుకుంటే, గత 600 ఏళ్లలో క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఇంతటి స్థాయిలో బద్దలవడం ఇదే తొలిసారి" అని KVERT డైరెక్టర్ ఒల్గా గిరినా వెల్లడించారు. అయితే, స్మిత్సోనియన్ సంస్థకు చెందిన గ్లోబల్ వోల్కానిజం ప్రోగ్రామ్ రికార్డుల ప్రకారం, ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 1550లో, అంటే దాదాపు 475 ఏళ్ల క్రితమే విస్ఫోటించిందని చెబుతోంది. ఈ గ్యాప్‌పై శాస్త్రవేత్తలలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ అరుదైన దృశ్యాన్ని సమీపంలోని మరో అగ్నిపర్వత సందర్శన ముగించుకుని తిరిగివస్తున్న పర్యాటక గైడ్లు తమ కెమెరాల్లో బంధించారు. ఆ దృశ్యాలను రాయిటర్స్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు ధృవీకరించాయి. 1,856 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వతం అకస్మాత్తుగా మేల్కొనడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూగర్భ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది.