ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. చర్లపల్లి నుంచి చెన్నైకి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై నాయుడుపేట స్టేషన్‌లో కూడా ఆగనుంది. ఇప్పటివరకు ఈ రైలు ఆ స్టేషన్‌లో ఆగకపోవడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. కానీ నాయుడుపేట పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజల డిమాండ్‌ను పరిశీలించి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మార్పు ఆగస్టు 18వ తేదీ సోమవారం నుంచే అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి–ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నాయుడుపేట స్టేషన్‌లో 2 నిమిషాలపాటు ఆగనుంది. దీంతో నాయుడుపేట పట్టణం మాత్రమే కాకుండా పరిసర గ్రామాల ప్రజలకు కూడా సౌకర్యం లభించనుంది. ఇకపై చెన్నై, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు వెళ్లే వారికి ఈ రైలు మరింత ఉపయోగకరంగా మారనుంది.
ట్రైన్ నంబర్ 12604 గా నడిచే ఈ సూపర్ ఫాస్ట్ రైలు ప్రతిరోజూ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు ఉదయం 5:40 గంటలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుతుంది. ఈ ప్రయాణం మొత్తం 12 గంటల 15 నిమిషాలు సాగుతుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా తెల్లవారుజామున 3:28 గంటలకు నాయుడుపేట స్టేషన్‌కు చేరుకుని 3:30 గంటలకు మళ్లీ బయలుదేరనుంది.
వారానికి ఏడు రోజులు ఈ రైలు నడవడం వల్ల ప్రయాణికులకు నిరంతర సౌకర్యం లభిస్తుంది. ప్రత్యేకంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు వంటి వారు ఈ కొత్త స్టాప్ వల్ల ఎక్కువగా లాభపడతారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రైలు ఎక్కడానికి సమీపంలోని పెద్ద స్టేషన్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు నేరుగా నాయుడుపేట నుంచే ప్రయాణం మొదలు పెట్టే అవకాశం రావడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
ఈ నిర్ణయం నాయుడుపేట సబర్బన్ పట్టణ అభివృద్ధికి కూడా దోహదపడనుంది. కొత్త రైల్వే స్టాప్ కారణంగా రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా ఆర్థిక, వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ చర్యతో ప్రయాణికులకు సౌకర్యం పెరగడం ఖాయం.