ఉపాధి హామీ శ్రామికులకు ఎట్టకేలకు శుభవార్త అందబోతోంది. 2014–2019 మధ్యకాలంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్ట్ 23న రూ.145 కోట్లు నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలలో జమ కానున్నాయి.
గతంలో వివిధ కారణాల వల్ల ఈ బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. తాజాగా వీటిని విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అదే సమయంలో, ఉపాధి హామీ పథకంలో అక్రమాలు చోటు చేసుకోకుండా కేంద్రం, రాష్ట్రం సంయుక్త చర్యలు చేపడుతున్నాయి. దొంగ మస్టర్ల సాయంతో తప్పుడు హాజరు చూపిస్తున్న ఘటనలు బయటపడటంతో.. ఇకపై ఉదయం, సాయంత్రం రెండు పూటలా శ్రామికుల ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేశారు.
ఈ ఫోటోలను ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది వెంటనే పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తప్పుడు ఫోటోలు అప్‌లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పష్టంచేశారు. ప్రతి రోజు గ్రామ, జిల్లా స్థాయిల నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదికలు పంపాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.