మంగళగిరిలో జరిగిన 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం పట్ల నారా లోకేశ్ చూపిన పట్టుదల, చిత్తశుద్ధి నిజంగా అభినందనీయమని ప్రశంసించారు.
గత ఎన్నికల్లో ఓటమి పాలైనా, మంగళగిరిని విడవకుండా నేతన్నల కోసం నిరంతరం కృషి చేసిన లోకేశ్ వల్లే ఈ రోజు చేనేత రంగానికి ప్రభుత్వం మరింత మద్దతుగా నిలవగలుగుతోందని ఆయన పేర్కొన్నారు.
లోకేశ్ చొరవతో ఏర్పడిన 'వీవర్‌శాల'ను సందర్శించిన అనంతరం సీఎం మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే 873 మందికి ఆధునిక రాట్నాలు, 20 మగ్గాలతో వీవర్‌శాల ఏర్పాటు చేసి 3,000 కుటుంబాలకు అండగా నిలవడం, లోకేశ్ సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తుందని కొనియాడారు. ఓటమి అనంతరం సేవలో ఎలాంటి తగ్గుదల లేకుండా పనిచేశారని పేర్కొంటూ, ఇప్పుడు 91 వేల ఓట్ల భారీ మెజారిటీ ఆయన సేవలకు ప్రజల చెల్లించిన బాద్యం అని తెలిపారు.
చేనేత యోధుడికి గౌరవం… చేనేత హక్కుల కోసం పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని ఇకపై ఆధికారికంగా జరుపుతామని, విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.