తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు పెద్ద మలుపు తిప్పబోతున్న ప్రాజెక్ట్ సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే. సుమారు రూ.3,500 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ రహదారి పూర్తయితే, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి అనుసంధానం కల్పించే ప్రధాన మార్గంగా మారబోతోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఖమ్మం నుంచి రాజమండ్రికి ప్రయాణ సమయం గంటన్నరకి తగ్గుతుండగా, విశాఖపట్నం, ఒడిశా వైపు వెళ్లే దూరం సుమారు 150 కి.మీ తగ్గుతుంది.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఈ హైవే పనులను పరిశీలించి దాని ప్రాముఖ్యతను వివరించారు. ఆయన దంసలాపురం వద్ద జాతీయ రహదారి ఎంట్రీ, ఎగ్జిట్ పనులు, మున్నేరు వంతెన, రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని దగ్గరగా పరిశీలించారు. ప్రణాళికలో లేని దంసలాపురం ఎగ్జిట్ కారణంగా కొంత జాప్యం ఉన్నా, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు వంతెన, రైల్వే ఫ్లైఓవర్ పనులు నవంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు.
ఈ హైవే రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు పెద్ద ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటివరకు ఖమ్మం నుంచి రాజమండ్రికి వెళ్ళాలంటే సూర్యాపేట మీదుగా విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది. కానీ కొత్త రహదారి పూర్తయితే ఖమ్మం నుంచి నేరుగా రాజమండ్రి చేరుకోవచ్చు. విశాఖపట్నం, ఒడిశా వైపు ప్రయాణం చేసే వారికి 150 కిలోమీటర్ల దూరం ఆదా అవుతుంది. ఇది ఇంధన ఖర్చులు తగ్గించడంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం వల్ల ఖమ్మం జిల్లాలో వ్యాపారం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు ఊపిరి పీలుస్తుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువులు వేగంగా మార్కెట్లకు చేరతాయి. దీని వలన ఆర్థిక కార్యకలాపాలు పెరిగి స్థానిక వ్యాపారాలు బలోపేతం అవుతాయి. ముఖ్యంగా రైతులకు కల్లూరు వరకు సర్వీస్ రోడ్లు నిర్మించాలని మంత్రి ఆదేశించడం రైతుల రవాణా అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
ఈ హైవే వల్ల మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పడి కొత్త పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. దాంతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇది కేవలం ఖమ్మం జిల్లాకే కాదు, మొత్తం రాష్ట్రానికి, దేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన రవాణా మార్గంగా నిలుస్తుంది. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల నెట్‌వర్క్‌లో ఇది ఒక ముఖ్యమైన అనుసంధానంగా మారనుందని అంచనా.