రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) ఈస్టర్న్ రైల్వేలో క్రీడా కోటా కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ సీ, గ్రూప్ డీ విభాగాల్లో మొత్తం 50 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్ 9, 2025 సాయంత్రం 6 గంటల వరకు.

ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, వాలీబాల్ వంటి క్రీడా విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. అభ్యర్థులు సంబంధిత క్రీడలో ప్రావీణ్యం సాధించి ఉండటంతో పాటు, ఐటీఐ, 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 2025 జనవరి 1 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు లేదా కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున పాల్గొనాలి. లేకపోతే జాతీయ స్థాయి లేదా యూనివర్సిటీ స్థాయి పోటీల్లో టాప్ ర్యాంకులు సాధించి ఉండాలి. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ పురుషులకు రూ.500గా నిర్ణయించగా, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మైనారిటీలు/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 మాత్రమే చెల్లించాలి. ట్రయల్స్ తర్వాత రూ.400 వరకు రిఫండ్ అందిస్తారు..
ఈ ఎంపికలో ఎలాంటి రాతపరీక్ష ఉండదు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య క్రీడా సామర్థ్య పరీక్షలు (ఫీల్డ్ ట్రయల్స్) నిర్వహించనున్నారు. ట్రయల్స్‌లో 40 మార్కులు, స్పోర్ట్స్ హిస్టరీకి 50 మార్కులు, విద్యార్హతలకు 10 మార్కులు కేటాయించారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు జరుగుతాయి. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ.18,000 నుంచి రూ.45,000 వరకు జీతం లభిస్తుంది.