మన శరీరంలో కనిపించే ప్రతి చిన్న మార్పు ఒక సంకేతమే. ముఖ్యంగా అవయవాల పనితీరులో లోపం వచ్చినప్పుడు శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రమాదం తప్పదు. ఈ మధ్యకాలంలో బీపీ, షుగర్ లాగే ఫ్యాటీ లివర్ వ్యాధి కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి ప్రారంభ దశలోనే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గుర్తిస్తే సమయానుకూలంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
యువతలో ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువైపోవడానికి ప్రధాన కారణం వారి జీవనశైలి. ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చోవడం, కదలికలు లేకుండా జీవించడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ అలవాటు చేసుకోవడం ఇవన్నీ ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యను సమయానికి గుర్తించకపోతే అది సిర్రోసిస్‌గా మారే ప్రమాదం ఉంది. అందుకే లక్షణాలను గమనించడం చాలా ముఖ్యం.
ఫ్యాటీ లివర్ వ్యాధి మొదటి సంకేతాల్లో ఒకటి కారణం లేకుండా బరువు పెరగడం. దీతో పాటు అలసట, బలహీనత ఎక్కువగా ఉండటం కూడా ప్రధాన సూచన. కాలేయం శరీరంలో శక్తి జీవక్రియకు ముఖ్యమైన అవయవం. అది సరిగా పనిచేయకపోతే శక్తి స్థాయిలు పడిపోతాయి. అదేవిధంగా పొట్ట కుడివైపు నొప్పి, వాపు, ముదురు మూత్రం లేదా పాలిపోయిన మలంలాంటి మార్పులు వచ్చినా నిర్లక్ష్యం చేయరాదు.
ఇక ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్, మెటబోలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలో ఉండటం కూడా ఈ వ్యాధికి సూచన. కాబట్టి ఇలాంటి లక్షణాలు గమనించిన వెంటనే లివర్ పరీక్ష చేయించుకోవడం అవసరం.
మొత్తానికి, ఫ్యాటీ లివర్ వ్యాధి నిశ్శబ్దంగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ శరీరం ఇచ్చే సంకేతాలను సమయానికి గుర్తించి వైద్యులను సంప్రదిస్తే దీనిని నియంత్రించడం సాధ్యం. ముఖ్యంగా ప్రారంభ దశలోనే జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.