ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సాధికారత కోసం మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి డ్వాక్రా సంఘాలను ప్రారంభించిన ఆయన, ఇప్పుడు వాటి పాత్రను మరింత విస్తరించేందుకు ఆలోచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా డ్వాక్రా సంఘాల మహిళలకు సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
క్యాంప్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ అనుబంధ రంగాల సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఆక్వా, ఉద్యాన పంటలు, ఫిషరీస్, మైక్రో ఇరిగేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. అంతేకాకుండా రైతులను ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు సాగు చేయమని ప్రోత్సహించాలని సూచించారు. ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి డిమాండ్ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి వాటిని రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఈ దిశగా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను (FPOs) ప్రోత్సహించాలన్నారు. ప్రతి రైతును పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తుల మార్కెట్ విస్తృతమవుతుందని చెప్పారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రైతులకు అవగాహన కల్పించేలా వర్క్‌షాప్‌లు నిర్వహించాలని ఆదేశించారు.
ముఖ్యంగా ఆక్వా రంగంపై ఎక్కువ దృష్టి సారించిన చంద్రబాబు, ఆక్వా ఉత్పత్తుల సాగును రెట్టింపు చేయాలని చెప్పారు. ఈ లక్ష్యంతో ఆక్వా కల్చర్ యూనివర్శిటీ స్థాపనపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించి, క్లస్టర్ ఆధారంగా సామూహిక షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
డ్వాక్రా సంఘాల మహిళలకు పశువుల షెడ్ల నిర్వహణ మాత్రమే కాకుండా పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లు వంటి వాటి బాధ్యతలు కూడా అప్పగించే అవకాశముందని ఆయన తెలిపారు. ఇలా చేస్తే మహిళలు ఆర్థికంగా మరింత బలపడతారని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేస్తున్నాయి.