కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) గ్రూప్-సి నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 1121 పోస్టులు ఉన్నాయి. ఇందులో రేడియో ఆపరేటర్ పోస్టులు 910, రేడియో మెకానిక్ పోస్టులు 211. ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అదనంగా ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా తప్పనిసరి. వయస్సు పరిమితి 18 నుంచి 25 సంవత్సరాలు. అయితే ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 23, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికవుతారు. సాధారణ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం లభిస్తుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.