కరోనా వైరస్ వచ్చి వెళ్లిపోయినా, దాని లాంగ్ కోవిడ్ (Long Covid) ప్రభావం మాత్రం చాలామందిని ఇంకా వెంటాడుతోంది. ఈ లాంగ్ కోవిడ్ బాధితుల్లో.. ముఖ్యంగా మధ్యవయస్కులైన మహిళల్లో ఒక అసాధారణ గుండె సంబంధిత రుగ్మత ఎక్కువగా కనిపిస్తోందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. ఈ కొత్త ఆరోగ్య సమస్య పేరు 'పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాకీకార్డియా సిండ్రోమ్' (POTS).
ఈ 'పాట్స్' సమస్య లాంగ్ కోవిడ్ రోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పరిశోధనలు స్పష్టం చేశాయి. ఈ సమస్య లాంగ్ కోవిడ్ లక్షణాలను పోలి ఉండటం గమనార్హం. అందుకే, లాంగ్ కోవిడ్‌తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ లక్షణాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
'పాట్స్' (POTS) అనేది ఒక విచిత్రమైన ఆరోగ్య సమస్య. పేరులో ఉన్నట్లే, ఇది గుండె వేగానికి సంబంధించిన సిండ్రోమ్. పడుకున్న స్థితి నుంచి నిలబడినప్పుడు లేదా నిటారుగా కూర్చున్నప్పుడు గుండె వేగం (Heart Rate) అసాధారణంగా, హఠాత్తుగా పెరుగుతుంది.
ఈ రుగ్మతతో బాధపడేవారికి నిలబడటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొద్దిసేపు నిలబడినా తల తిరగడం, కళ్లు మసకబారడం లాంటివి జరుగుతాయి. తీవ్రమైన అలసట (Fatigue), ఏకాగ్రత లోపించడం (Brain Fog), తల తిరగడం వంటి లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు అచ్చం లాంగ్ కోవిడ్ లక్షణాలను పోలి ఉండటం వల్ల చాలామంది దీన్ని మామూలు అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఈ 'పాట్స్' సమస్య లాంగ్ కోవిడ్‌తో ఎంతవరకు ముడిపడి ఉందో తెలుసుకోవడానికి పరిశోధకులు లోతుగా అధ్యయనం చేశారు. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరని 467 మంది లాంగ్ కోవిడ్ బాధితులపై పరిశోధనలు జరిగాయి.
వీరిలో ఏకంగా 91 శాతం మంది గతంలో ఆరోగ్యంగా, చురుకుగా ఉన్న మధ్యవయస్కులైన మహిళలే కావడం గమనార్హం. అంటే ఈ వ్యాధి మహిళలపైన, చురుకుగా ఉండే మధ్యవయస్కులపైన ఎక్కువగా ప్రభావం చూపుతోందని అర్థమవుతోంది.
అధ్యయనం ముగిసేసరికి, వీరిలో దాదాపు 31 శాతం మందికి 'పాట్స్' ఉన్నట్లు కచ్చితంగా నిర్ధారణ అయింది. మరో 27 శాతం మందిలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా, వారికి పూర్తిస్థాయిలో 'పాట్స్' అని నిర్ధారణ కాలేదు. కానీ వారు కూడా ఆ లక్షణాలతో బాధపడుతున్నా రని తేలింది.
కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మికాయిల్ బ్యోర్న్‌సన్ ఈ ఫలితాలపై మాట్లాడుతూ, "లాంగ్ కోవిడ్ రోగులలో 'పాట్స్' అనేది చాలా సాధారణ సమస్య అని మేం ఇప్పుడు కచ్చితంగా చెప్పగలం. ఈ సమాచారం వైద్యులకు, రోగులకు ఎంతో విలువైనది" అని తెలిపారు.
'పాట్స్' గురించి తెలిసినప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సమస్యకు చికిత్స అందుబాటులో ఉంది.
అసోసియేట్ ప్రొఫెసర్ జూడిత్ బ్రచ్‌ఫెల్డ్ మాట్లాడుతూ, 'పాట్స్'ను తక్కువ ఖర్చుతో కూడిన, సులభమైన పరీక్షల ద్వారా అన్ని స్థాయిల ఆరోగ్య కేంద్రాల్లో గుర్తించవచ్చు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి, లక్షణాలను తగ్గించి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సాధారణ జీవితం గడపవచ్చు.
ముఖ్య సూచన: లాంగ్ కోవిడ్ బారినపడి, నిలబడినప్పుడు గుండె వేగం పెరగడం, తలతిరగడం, లేదా తీవ్రమైన అలసట వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి 'పాట్స్' పరీక్ష చేయించుకోవాలని పరిశోధకులు గట్టిగా సూచిస్తున్నారు. సరైన సమయంలో రోగ నిర్ధారణ చేసుకుంటే చికిత్స సులభం అవుతుంది.