మనలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ వేడి టీ కడుపులో పడితే తప్ప రోజు మొదలవ్వదు, ఏ పనీ ముందుకు సాగదు. కొందరైతే అస్సలు ఏమీ తినకుండా, పూర్తిగా పరగడుపున (ఖాళీ కడుపుతో) టీ తాగుతుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై కొన్ని దుష్ప్రభావాలను చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీరు కూడా టీని అంతగా ప్రేమిస్తే, మీ ఆరోగ్యం కోసం ఈ అలవాటును కొంచెం మార్చుకోక తప్పదు. ఎందుకంటే, ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మీ జీర్ణశక్తి బలహీనపడటం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి పోషకాహార లోపం వరకు అనేక సమస్యలు తలెత్తవచ్చు.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మొదటగా దెబ్బతినేది మన జీర్ణవ్యవస్థే. కడుపులోకి వేరే ఆహారం ఏమీ లేకుండా నేరుగా టీ వెళ్లడం వల్ల తీవ్రమైన ప్రభావం పడుతుంది.
ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు: టీలో సహజంగా ఉండే కెఫిన్ కడుపులో యాసిడ్ స్థాయిని అమాంతం పెంచుతుంది. దీంతో ఉదయాన్నే మీకు ఎసిడిటీ (పుల్లటి తేన్పులు), గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలు ఒక్కసారి వచ్చాయంటే.. ఇప్పుడిప్పుడే వీడి వెళ్లడం కష్టం.
టీలో ఉండే కొన్ని సమ్మేళనాలు జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు కారణమై, మెల్లగా ఆకలిని తగ్గిస్తాయి. దీంతో ఉదయం పూట సరైన అల్పాహారం తీసుకోకుండా పోతారు.
ఆకలి తగ్గడం వల్ల శరీరంపై దీర్ఘకాలంలో పెద్ద ప్రభావం పడుతుంది. శరీరానికి అవసరమైన పోషణ లభించక పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో ముఖ్యమైన పోషకాల శోషణ (Absorption) పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎప్పటి నుంచో ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉన్నవారిలో, టీలో ఉండే కొన్ని పదార్థాల వల్ల ఐరన్ (ఇనుము) లోపం ఏర్పడుతుంది. ఇది క్రమంగా రక్తహీనత (Anemia) వంటి సమస్యలు తలెత్తడానికి ఒక ముఖ్య కారణంగా మారుతుంది.
టీలో ఉండే కెఫిన్ దీర్ఘకాలంలో మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అధికంగా టీ తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు (Stress Hormones) పెరుగుతాయి. పరగడుపున టీ తాగినప్పుడు ఈ ప్రభావం మరింత తీవ్రమౌతుంది.
దీనివల్ల మానసిక కల్లోలం, చిరాకు (Irritation) వంటివి పెరుగుతాయి. కొందరిలో నిద్రలేమి సమస్యలకు కూడా దారితీస్తుంది. టీ వల్ల మన శరీరంలో నీటి శాతం కూడా ప్రభావితమవుతుంది.
టీలోని కెఫిన్ మూత్రవిసర్జన ప్రభావాన్ని (Diuretic effect) కలిగి ఉంటుంది. అంటే ఇది శరీరం నుండి నీటిని తొలగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఉదయాన్నే శరీరం నిర్జలీకరణానికి (Dehydration) గురవుతుంది. దీనివల్ల చర్మ సమస్యలు, అలసట, బలహీనత వంటివి చుట్టుముట్టవచ్చు.
టీలోని ఆమ్లాలు, ముఖ్యంగా చక్కెరతో కలిసినప్పుడు, నోటిలో ఆమ్ల స్థాయిలను పెంచుతాయి. ఇది దంతాల ఎనామెల్‌ను నాశనం చేస్తుంది. దీంతో దంతాలు పసుపు రంగులోకి మారి, దీర్ఘకాలంలో ఎముకలు బలహీనపడవచ్చు.
పరగడుపున టీ తాగే ఈ అలవాటు క్రమంగా దీర్ఘకాల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే, మీ అలవాటును మార్చుకోవడం చాలా అవసరం. అల్పాహారం (Breakfast) తర్వాత టీ తాగడం అనేది అత్యుత్తమం. అప్పటికే కడుపులో కొంత ఆహారం ఉంటుంది కాబట్టి, టీ ప్రభావం తగ్గుతుంది.
ఒకవేళ అల్పాహారం తినడానికి సమయం లేకపోతే, కనీసం టీ తాగే ముందు బన్, బ్రెడ్ లేదా రెండు బిస్కట్లు వంటివి తిన్న తర్వాత టీ తాగండి. ఇలా చేయడం వల్ల కెఫిన్ తీవ్రత కొంతవరకు తగ్గి, కడుపులో యాసిడ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.
ఒకవేళ ఖాళీ కడుపుతోనే వేడి పానీయం తాగాలని అనిపిస్తే, కెఫిన్ లేని హెర్బల్ టీ (ఉదాహరణకు: గ్రీన్ టీ, అల్లం టీ, నిమ్మ టీ) తీసుకోవడం ఉత్తమం. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.