ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువు పొడగించాలనే డిమాండ్ మరోసారి వినిపిస్తోంది. గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (జీసీసీఐ) సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ)కు వినతిపత్రం సమర్పించింది.
జీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఐటీఆర్ యుటిలిటీలు (ఫారాలు) విడుదలలో తీవ్రమైన జాప్యం జరిగింది. ఆగస్టు వరకు కూడా ఐటీఆర్-6 మరియు ఐటీఆర్-7 ఫారాలు అందుబాటులోకి రాలేదు. అంతేకాకుండా, ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో తరచుగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు అవసరమైన అప్‌డేట్లు చేసుకోవడానికి సమయం పడుతున్నందున, రిటర్నుల సిద్ధతలో కూడా ఆలస్యం జరుగుతోంది.
ఇకపై ప్రస్తుత గడువుల్లోగా రిటర్నులు దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు కష్టతరమని జీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30గా ఉన్న ట్యాక్స్ ఆడిట్ గడువుతో పాటు ఐటీఆర్ ఫైలింగ్ గడువును కూడా పొడిగించాలని కోరింది.