ఆంధ్రప్రదేశ్‌లో హైవేలు, జిల్లా, గ్రామీణ రహదారులపై స్పీడ్‌బ్రేకర్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) జారీ చేసిన తాజా మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఉన్న స్పీడ్‌బ్రేకర్లను కూడా IRC ప్రమాణాలకు అనుగుణంగా సరిదిద్దాలని, లేకపోతే తొలగించాలని స్పష్టం చేసింది.
ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 6న జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన స్పీడ్‌బ్రేకర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు, స్పీడ్‌బ్రేకర్లు ఎలా ఉండాలో IRC మార్గదర్శకాలను స్పష్టంగా పేర్కొంది.
అందులో భాగంగా –. స్పీడ్‌బ్రేకర్ వెడల్పు 3.7 మీటర్లు, ఎత్తు 10 సెంటీమీటర్లు ఉండాలి. వాహనం ఎక్కి దిగేటప్పుడు 17 మీటర్ల వ్యాసార్థం ఉండాలి. స్పీడ్‌బ్రేకర్లు స్పష్టంగా కనిపించేలా తెలుపు, పసుపు రంగుల్లో వేయాలి. స్పీడ్‌బ్రేకర్ రాకముందు 40 మీటర్ల దూరంలో హెచ్చరిక బోర్డు తప్పనిసరిగా ఉండాలి.