ఆర్‌బీఐ వరుసగా రెపో రేట్లు తగ్గించి రుణగ్రహీతలకు ఊరట కల్పిస్తున్న వేళ, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మాత్రం గృహ రుణదారులకు ఝలక్ ఇచ్చింది. తాజాగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25%) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.50% – 8.70% శ్రేణిలో ఉండనున్నాయి. కనీస రేటులో మార్పు లేకపోయినా, గరిష్ట రేటు పెంపు వల్ల ముఖ్యంగా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలపై భారీ భారం పడనుంది.
ఆర్‌బీఐ ఇప్పటికే రెపో రేటును 5.5%కి తగ్గించినా, బ్యాంకుల లాభదాయకతపై ఒత్తిడి పెరగడం వడ్డీ పెంపుకు కారణమని ఎస్‌బీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి బ్యాంకులు 7.35% నుంచి 10.10% మధ్య హోమ్ లోన్ రేట్లను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ మార్గంలో మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ పెంపుకు సిద్ధమవుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.