ఉన్నత విద్యాసంస్థల్లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు కోర్సులు ఇకపై ఓపెన్, ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) విధానంలో బోధించరాదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ఆదేశాలు జారీ చేసింది.
2025 జూలై-ఆగస్టు విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు జూలై 23, 2025న జరిగిన 592వ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, ఏప్రిల్ 22న జరిగిన 24వ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వర్కింగ్ గ్రూప్ సిఫార్సుల ఆధారంగా తాజాగా ప్రకటన విడుదల చేసింది.
ఇకపై సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ & న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్ వంటి కోర్సుల్లో ఓపెన్, ఆన్‌లైన్, డిస్టెన్స్ పద్ధతుల్లో ప్రవేశాలు ఇవ్వరాదు.
అయితే ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ వంటి కోర్సులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.