హెచ్-1బీ వీసాల ప్రక్రియలో మరో కొత్త అంశం తెర ముందుకు వచ్చింది. వీసా జారీ ప్రక్రియలో ట్రంప్ కార్యవర్గం కీలక మార్పులు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు గృహ భద్రత శాఖ ఓ ప్రతిపాదనను శ్వేతసౌధంలోని సమాచార మరియు నియంత్రణ వ్యవహారాల సమీక్ష కార్యాలయానికి పంపింది.
హెచ్-1బీ వీసాలు జారీ పరిమితిని ఏటా కాంగ్రెస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అది 85,000గా ఉన్నాయి. వీటిలో 20,000 వీసాలు మాస్టర్స్ డిగ్రీ చేసిన ఉద్యోగుల కోసం రిజర్వు చేశారు. ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం జారీ చేస్తారు.
ప్రస్తుతం ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు శుక్రవారం అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సేవలు ప్రకటించింది. అందుకు కారణం 2026 వార్షిక పరిమితికి తగినన్ని దరఖాస్తులు రావడం. దీంతో 2026 ఏడాదికి లాటరీ విధానం బహుశా ఉండకపోవచ్చు. లాటరీ విధానంలో వీసా దారులను ఎంపిక చేస్తారు.
ఈ ప్రక్రియ తర్వాత ఆయా కంపెనీలు తమకు వచ్చిన వీసాల్లో, అక్టోబర్ నాటికి విధుల్లో చేరాల్సిన కార్మికుల దరఖాస్తులను సమర్పిస్తాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక సదరు పోస్టుకు ఆఫర్ చేస్తున్న వేతనం ఆధారంగా వీసాలు జారీ చేశారు. కంపెనీలు మరింత మంది ఉన్నత స్థాయి నిపుణులను నియమించుకొనేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం అమలు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తక్కువ శ్రేణి జీతాలున్న ఉద్యోగాల్లో విదేశీయుల నియామకాలను నియంత్రించేందుకు ఉపయోగపడింది. నాడు 'బై అమెరికన్, హైర్ అమెరికన్' అనే కార్యక్రమం కింద దీన్ని నిర్వహించారు. 2021లో జో బైడెన్ అధికారంలోకి వచ్చాక దీన్ని పక్కనపెట్టారు.
ఇక తాజాగా గృహ భద్రత శాఖ పంపిన ప్రతిపాదనపై దాదాపు వెయ్యి వరకు ప్రజా అభిప్రాయాలు వచ్చినట్లు ఒక నివేదిక తెలిపింది. దీని వల్ల హెచ్-1బీ ఉద్యోగులు తక్కువగా అందుబాటులో ఉంటారని పేర్కొంది. వాస్తవానికి ఏ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈ లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు.
కానీ పెద్ద పెద్ద కంపెనీలు అధిక దరఖాస్తులు చేసి ఎక్కువ వీసాలను దక్కించుకొంటున్నాయి. ఈ లాటరీ విధానాన్ని తొలగించాలని ఈ ఏడాది జనవరిలో ఒక మేధోమథన సంస్థ సూచించింది. జీతం, సీనియార్టీ ఆధారంగా వీసాలు జారీ చేస్తే వాటి ఆర్థిక విలువ 88 శాతం పెరుగుతుందని తెలిపింది.