బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి ఉన్నారు. ఈడీ అధికారుల సూచన మేరకు, వీరంతా విచారణకు హాజరు కావాలని స్పష్టంగా నోటీసుల్లో పేర్కొంది.
విచారణ తేదీలు క్రమంగా ఇలా ఉన్నాయి: జూలై 23న రానా, జూలై 30న ప్రకాశ్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు పంపించబడ్డాయి. ఈ నోటీసులు గతంలో నమోదైన కేసులు ఆధారంగా జారీ చేయబడ్డాయి. ముఖ్యంగా పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నంలో ఈ విషయానికి సంబంధించి కేసులు నమోదయ్యాయి.
ఈడీ దర్యాప్తు ప్రకారం, మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లుపై ఈసీఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. నిందితులు జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365 వంటి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయడం వివాదాస్పదంగా మారింది. వారి ప్రమోషన్ల ప్రభావంతో యువత బెట్టింగ్‌కు ఆకర్షితమై డబ్బులు కోల్పోవడంతో పాటు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
ఈ యాప్‌ల ద్వారా నిర్వాహకులు కోట్లాది రూపాయలు అక్రమంగా కొల్లగొట్టినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలపై ప్రభావం కలిగించే ప్రముఖుల ప్రమోషన్లపై విచారణ మరింత కఠినతరం కానుంది. ఇప్పటికే ఈడీ విచారణ ముమ్మరం చేయడంతో, మరికొంతమంది సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి రావచ్చని అంచనా.