జామ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం రెండూ చెబుతున్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు, సహజ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా జామ ఆకుల టీ కళ్ల ఆరోగ్యానికి, చర్మానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి కావలసిన ఫ్లావనాయిడ్స్, టానిన్స్, గ్లైకోసైడ్స్, సాపోనిన్స్ వంటి పలు పోషకాలు అందిస్తాయి. ఇవి డయాబెటిస్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
ఇంట్లో జామ ఆకుల టీ తయారు చేయడం చాలా సులభం. ముందుగా 4-5 తాజా జామ ఆకులను శుభ్రంగా కడిగి, 2 కప్పుల నీటిలో వేసి మరిగించాలి. 10-12 నిమిషాల పాటు తక్కువ మంటపై మరిగించిన తరువాత, మంట ఆపి 5 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఆ తరువాత వడగట్టి, కావాలనుకుంటే తేనె లేదా నిమ్మరసం వేసుకుని వేడిగా తాగాలి. ఈ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల కళ్ల పొడిబారడం తగ్గి, చూపు స్పష్టంగా ఉంటుంది.
జామ ఆకుల్లో విటమిన్ A పుష్కలంగా ఉండటంతో చూపు మెరుగుపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం జామ ఆకులు తల తిరగడం, కళ్ల అలసట తగ్గించడంలో, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. అందువల్ల జామ ఆకుల టీని ఆరోగ్య పానీయంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.