ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి, సదరం సర్టిఫికెట్లలో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి కూడా ఇకపై పింఛన్లు కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ తనిఖీల్లో కొందరికి పొరపాటున నోటీసులు వెళ్లడంతో, వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగులకు పెద్ద ఊరట లభించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) ఇప్పటికే జిల్లాలకు ఆదేశాలు పంపింది.
గతేడాది డిసెంబర్ నుండి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల, హెల్త్ కోటా పింఛన్లలో అనర్హులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కొందరికి పింఛన్ రద్దు/కేటగిరీ మార్పు నోటీసులు జారీ చేశారు. అయితే, అర్హులైనవారు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
దరఖాస్తుదారులు ఎంపీడీవో కార్యాలయంలో అర్జీ, ఆధార్ జెరాక్స్, పింఛన్ నోటీసు, పాత–కొత్త సదరం సర్టిఫికెట్లు, ఆసుపత్రి చికిత్స రికార్డులు సమర్పించాలి. అనంతరం మళ్లీ Reassessment కు పిలిచి తుది నిర్ణయం తీసుకుంటారు.
ప్రభుత్వం స్పష్టం చేసింది: అర్హులైనవారికి పింఛన్లు యథావిధిగా అందుతాయి. అనర్హులపై మాత్రం చర్యలు తప్పవు.