దేశవ్యాప్తంగా హైకోర్టు న్యాయమూర్తుల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 మంది న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేయగా, వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రానున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి నేతృత్వంలో జరిగిన కొలీజియం సమావేశంలో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డి. రమేశ్, కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ శుభేందు సమంతలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడగానే ఈ బదిలీలు అమల్లోకి రానున్నాయి.
ఇందులో విశేషం ఏమిటంటే.. జస్టిస్ రాయ్, జస్టిస్ రమేశ్‌లు ఏపీకి చెందినవారే. వీరిద్దరూ గతంలో కూడా ఏపీ హైకోర్టులోనే సేవలందించారు. అలాగే జస్టిస్ శుభేందు సమంత పశ్చిమ బెంగాల్‌కి చెందిన వారు. ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థాన జడ్జిగా, కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేసి 2022లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.